Rental Cars Fraud in Hyderabad :అనారోగ్యంతో భర్త మరణం. అప్పటికే చికిత్స కోసం లక్షల్లో ఖర్చు. అప్పుల భారం ఆ మహిళను పెడదారి పట్టించింది. సెల్ఫ్ డ్రైవ్‌కు కార్ల ఇస్తే మంచి ఆదాయం ఇస్తామని చెప్పి యజమానుల నుంచి కార్లు తీసుకుని వాటిని దారి మళ్లించింది. అలా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న కిలేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెకు సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.2.5 కోట్లు విలువ చేసే కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి టెలికంనగర్‌లో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గచ్చిబౌలి టెలికంనగర్కు చెందిన జూపూడి ఉష కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పని చేస్తున్న సమయంలో తేనెటీగలు కుట్టడంతో కోమాలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన చికిత్సకు సుమారు కోటి రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. అయినా ఆమె భర్త బతకలేదు. దీంతో చికిత్స కోసం చేసిన అప్పులు తీర్చేందుకు తన వద్ద ఉన్న కారును సెల్ఫ్ డ్రైవ్‌కు ఇచ్చింది.
Car Rental Scam in Hyderabad : ఇదే సమయంలో ఆమెకు తుడుముల్ల మల్లేశ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తన కారుతో కొంత ఆదాయం వస్తుండటంతో మల్లేశ్ సహాయంతో మరిన్ని కార్లు సేకరించి సెల్ఫ్ డ్రైవ్‌కు ఇవ్వాలని భావించింది. పలువురు యజమానులకు కార్లు కావాలని, తమ మేడం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వినియోగించేందుకు కార్లు వినియోగిస్తామని వారికి చెప్పాడు. దీంతో మొత్తం 21 మంది తమ కార్లను సెల్ఫ్ డ్రైవ్ కోసం ఇచ్చారు. నెల నెలా అద్దె ఇస్తామని హామీ ఇవ్వడంతో కార్లను యజమానులు అప్పగించారు.