Hyderabad Man Cheated Many Women: పెళ్లి పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న నిత్యపెళ్లికొడుకు లీలలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఇతడి బారినపడిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఒక్కొక్కరూ ముందుకొస్తున్నారు. హైదరాబాద్‌కి చెందిన నిత్యపెళ్లి కొడుకు వయసు కనిపించకుండా విగ్గు ధరించి కాస్ట్లీ దుస్తులతో ఫొటోలు దిగుతాడు. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పరిచయాలున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. అయితే విలాసవంతంగా బతికేందుకు అతడు ఎంచుకున్న మార్గం మ్యారేజ్.
మ్యాట్రిమోనీసైట్లలో సామాజికవర్గానికి తగినట్టుగా ఇంటిపేరు మార్చుకుని రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. తన ప్రొఫైల్ నచ్చి స్పందించిన అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లిచూపులకు పిలిచిన వెెంటనే తన పరిచయస్తులను బంధువులుగా చెబుతూ రంగంలోకి దింపుతాడు. అమ్మాయికి నచ్చినట్టు తెలియగానే ఫోన్ నంబర్ తీసుకొని ఇక ఛాటింగ్ మొదలుపెడతాడు. హోటల్, కాఫీక్లబ్‌కు తీసుకెళ్లి వారి సానుభూతి పొందేందుకు ప్లాన్లు వేస్తాడు.
గచ్చిబౌలిలో నిత్య పెళ్లికొడుకు - విగ్ పెట్టుకుని వేషాలు మారుస్తూ..!
భగ్న ప్రేమికుడినంటూ:తమ పెళ్లికి ఇరువురి ఫ్యామిలీలు అంగీకరించాయనే భరోసాతో వెళ్లిన ఆడపిల్లలను భావోద్వేగానికి గురిచేసేలా కట్టుకథలు చెప్తాడు. తానొక భగ్నప్రేమికుడినని, ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని, దాని నుంచి బయటపడేందుకు తనకు తాను శిక్ష విధించుకున్నానంటూ చేతిపై కత్తితో కోసుకున్నట్టు గాయాలు చూపుతాడు. ఇదంతా నమ్మి కరిగిపోయిన అమ్మాయిలను ఏకాంతంగా గడిపేందుకు ఒత్తిడి చేస్తాడు. ఇలా వెళ్లిన ఇద్దరికి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి నగ్న ఫొటోలు, వీడియోలు తీసినట్టు సమాచారం. మరో అమ్మాయిని ఇలాగే విసిగించటంతో విషయం తల్లిదండ్రుల చెప్పి, పెళ్లికి నిరాకరించింది.
మరోవైపు పెళ్లి అవసరాలకు డబ్బు కావాలంటూ 20 నుంచి 40 లక్షల రూపాయలు వరకు ఆడపిల్లల కుటుంబం నుంచి లాగేస్తాడు. ఇతడి గురించి తెలిసి ఎవరైనా నిలదీస్తే తన వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి భయపెడతాడు. ఎవరికైనా చెప్తే సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరిస్తాడని ఒక బాధితురాలి బంధువు తెలిపాడు. గతంలో ఎంతోమందిని మోసగించిన ఇతడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు గుర్తించిన ఓ కుటుంబం అతడిని హెచ్చరించినట్టు సమాచారం. కుమార్తె పెళ్లి కోసం దాచుకున్న సొమ్మును కొట్టేసిన నిత్యపెళ్లికొడుకుని ఏమీ చేయలేక, డబ్బును రాబట్టుకోలేక మనోవేదన అనుభవిస్తున్నానంటూ మరో బాధితురాలి తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.
పెళ్లి పేరుతో దగ్గరై డబ్బులు లాగేస్తారు - గట్టిగా అడిగితే ఎదురు కేసులు