Real Estate Fraud : ఆమె అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్లను దోచేసుకుంది. చివరికి ఆ మహిళ చేసిన మోసం గుట్టురట్టవడంతో రాత్రికి రాత్రే దేశం విడిచి వెళ్లిపోవాలనుకుంది. కానీ పోలీసులు మాత్రం విడిచిపెట్టలేదు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండుకు తరలించారు.
ఇన్‌స్పెక్టర్ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ నిజాంపేట బాలాజీనగర్‌కు చెందిన గుర్రం విజయలక్ష్మి శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, భావన జీఎల్‌సీ క్రిబ్స్, శ్రీలక్ష్మి మాగ్నస్ కన్‌స్ట్రక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థలను ప్రారంభించింది. ఆమె 2018లో మల్లంపేటలోని 170/3, 170/4, 170/4ఏ సర్వే నెంబర్లలో విల్లాల నిర్మాణం చేపట్టగా, మొత్తం 325 విల్లాల్లో కేవలం 65కు మాత్రమే హెచ్‌ఎండీఏ అనుమతులు ఇచ్చింది. మిగిలిన 260 విల్లాలకు పంచాయతీ అనుమతులు చూపించారు. ఇలా దాదాపు 260 విల్లాలను విక్రయించింది.
ఆమె కట్టిన విల్లాలన్నీ అక్రమమని 2021లో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్‌కు ఫిర్యాదులు వెళ్లగా, ఆయన విచారణ జరిపారు. విచారణలో 201 విల్లాలను సీజ్ చేశారు. అయినా సరే విజయలక్ష్మి తన పలుకుబడితో వాటిని మళ్లీ రిజిస్ట్రేషన్లు చేయించుకుంది. అయితే వాటిలో స్థానిక కత్వ చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన 26 విల్లాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని గతేడాది సెప్టెంబరులో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. అదే నెలలో హైడ్రా ఆధ్వర్యంలో 15 విల్లాలను కూల్చేశారు.