6.4 కోట్ల రూపాయల బంగారం, వెండి స్వాధీనం - బీవీసీ లాజిస్టిక్స్ పేరుతో తరలింపు Huge Amount of Gold and Silver Seized: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓ వైపు పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేయగా, మరోవైపు కొన్ని పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు తాయిలాలు పంచే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అధికార పార్టీకి చెందిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా చెక్‌పోస్టుల దగ్గర పోలీసులు తనిఖీలను పెంచారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, అనుమతి లేకుండా తీసుకెళ్తున్న ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి.
అయితే తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్న అధికారులు రసీదును ఇస్తున్నారు. తరువాత నిర్వహించే విచారణలో సీజ్ చేసిన వాటికి సంబంధించిన అధికారిక పత్రాలను పోలీసులకు అందజేస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వాటిని తిరిగి ఇస్తున్నారు. ఇప్పటికే చెక్ పోస్టుల ద్వారా ఎక్కడికక్కడ నిఘాను ఉద్ధృతం చేశామని, సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా పాటించాలనే ఆదేశాలను ఇప్పటికే జారీ చేశారు.
ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం - విశాఖలో నగదుతో పట్టుబడ్డ వైవీ ప్రైవేట్ కార్యదర్శి - srikakulam Police Checking Vehicles
భారీగా బంగారం, వెండి వస్తువులు స్వాధీనం:కాగా సార్వత్రిక ఎన్నికలు 2024 (Andhra Pradesh Elections 2024) భాగంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో ఏప్రిల్ 26వ తేదీన డెంకాడ మండలం రాజాపులోవ వద్ద ఎస్సై కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. బీవీసీ లాజిస్టిక్ కొరియర్ సర్వీసు పేరుతో ఉన్న వ్యానులో ముగ్గురు వ్యక్తుల నుంచి బంగారం, వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి శుక్రవారం సాయంత్రం విజయనగరం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చెయ్యగా వారి వద్ద ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు భోగాపురం సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.
సీజ్ చేసిన వస్తువుల విలువ 6 కోట్ల 40 లక్షలు:పట్టుబడిన బంగారు వస్తువులు సుమారు 10 కిలోలు అని, వెండి వస్తువులు సుమారు 15 కిలోలు ఉంటాయన్నారు. సీజ్ చేసిన వస్తువుల విలువ సుమారు 6 కోట్ల 40 లక్షలు రూపాయలుగా ఉంటుందని అంచనా వేసినట్లుగా ఆయన తెలిపారు. బంగారం తరలిస్తున్న వ్యక్తులలో ఒకరు వేపగుంటకు చెందిన బల్ల జగదీశ్ కాగా, మరొక ఇద్దరు వ్యక్తులు విశాఖపట్నం మర్రిపాలెంకు చెందిన కుబేర మంజునాథ్ సింగ్, మందపాటి శ్రీనివాసరాజుగా గుర్తించామని భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.
వాహన తనిఖీల్లో పట్టుబడిన రూ.కోటి 31లక్షలు- ముగ్గురు అరెస్టు - Police Check Vehicles Seize Money