Home Theater Systems With Cinematic Surround Sound : సినిమా చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే ఇది ఒకప్పటి మాట. ఇంట్లోని టీవీలో చూద్దామంటే హాల్లోని దృశ్య, శబ్ద నాణ్యత, సంగీతం ఉండేవి కావు. పోనీ హోం థియేటర్ కొందామంటే రూ.లక్షల్లో ఖర్చు, అది ధనవంతులకే అని సరిపెట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. హోం థియేటర్ మధ్యతరగతి ఇళ్లలో సైతం వాలిపోతోంది. పదుల కొద్దీ ఓటీటీలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు లక్షలకొద్దీ యూట్యూబ్ వీడియోలతో కొత్తలోకం చూపిస్తోంది.
ఇవే కాకుండా పెళ్లిళ్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఇతర కార్యక్రమాల వీడియోలను హోం థియేటర్లో చూస్తేనే వంద శాతం సంతృప్తి అనేలా అభిరుచులు మారిపోతున్నాయి. టీవీలు, హోం థియేటర్లలో తెర, సాంకేతికతకు అనుగుణంగా ధరలు రూ.50 వేల నుంచి మొదలవుతున్నాయి. చిత్రంలో, శబ్దంలో నాణ్యత కోసం గదిలో ఏర్పాటు చేసే ఆధునిక సౌకర్యాలకు అనుగుణంగా ఈ ధర రూ. లక్ష, రూ.5 లక్షలు, రూ.30 లక్షలు ఎంతైనా ఇక మీ ఇష్టం.
కోరుకున్న సాంకేతికత :హోం థియేటర్ అంటే రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పని లేదు. అలాగని చిత్ర, శబ్ద నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. 4కే, అల్ట్రాహెచ్‌డీ, క్యూఎల్ఈడీ టీవీలు, డాల్బీ అట్మాస్, డీటీఎస్ ఎక్స్ శబ్ద సాంకేతికతతో వస్తున్నాయి. పలు కంపెనీల ఉత్పత్తులు నాణ్యతలో అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీనిస్తున్నాయి. దీంతో బడా బ్రాండ్లు సైతం దిగొచ్చి సామాన్యుడి ఇంటి తలుపు తడుతున్నాయి. 65 అంగుళాల యూహెచ్డీ, క్యూఎల్ఈడీ టీవీలు రూ.35 వేల నుంచి లభిస్తున్నాయి. సౌండ్ సిస్టమ్‌కు రూ.15 వేలు పెడితే చాలు ఇంట్లోనే హోం థియేటర్ సిద్ధం. ప్రముఖ కంపెనీలకు చెందినవైతే ధర కాస్త ఎక్కువ ఉంటుంది. ఓఎల్ఈడీ (OLED), క్యూఎల్ఈడీ (QLEd), మినీ ఎల్ఈడీ టీవీలకు రూ.లక్షపైనే ఖర్చు పెట్టాలి. తెర పరిమాణం పెరిగేకొద్దీ ధరలు పెరుగుతాయి.
- టీవీలకు సంబంధించి నిట్స్‌లో కాంతిని కొలుస్తారు. ప్రస్తుతం ఉన్న వాటిలో మినీ ఎల్ఈడీలు.. సూక్ష్మ ఎల్ఈడీ డయోడ్లతో తెరపై శక్తిమంతమైన, స్పష్టమైన రంగుల్ని అందిస్తాయి. నిట్స్ ఆధారంగా వాటి నాణ్యత, ధర ఉంటుంది.
- సినిమా చూడాలన్నా.. పాటలు వినాలన్నా శబ్ద నాణ్యత ఎంతో ముఖ్యం. దీన్ని డాల్బీ అట్మాస్ టెక్నాలజీ అందిస్తుంది. 360 డిగ్రీల కోణంలో శబ్ద తరంగాల్ని వ్యాప్తిచెందేలా చేస్తుంది. ఓటీటీ ఛానెల్స్‌లో 4కే, 8కే రిజల్యూషన్‌తో వచ్చే వీడియోలు ఈ విధానాన్ని సపోర్టు చేసేలా ఉంటున్నాయి.
- హోం థియేటర్లో ప్రొజెక్టర్ వ్యయమే అధికం. ఇందులో ఎలాంటి రంగు గోడపై ప్రదర్శించినా, ఎగుడు దిగుడుగా ఉన్నా.. అందుకు అనుగుణంగా చిత్రాన్ని సర్దుబాటు చేసుకునే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఇవి రూ.6 వేల నుంచి రూ.17 లక్షల వరకు ఉన్నాయి. ఫుల్ హెచ్డీ, 4కే, నేటివ్ 4కే, 8కే తదితర సాంకేతికతకు అనుగుణంగా ధరల శ్రేణి ఉంటుంది.
ఏ విభాగం ఎంత ధరలో అంటే : సాధారణ రకానివి రూ.50 వేలు వీటిలో 55 నుంచి 65 అంగుళాల మధ్య టీసీఎల్, తోషిబా, హయర్, హైసెన్స్, వూ, ఏసర్, ఎంఐ తదితర కంపెనీల 4కే యూహెచ్డీ టీవీలు సోనీ, యమహా, పానాసోనిక్, ఐకాల్, ఓబేజ్, జీబ్రానిక్స్, జేబీఎల్, క్రాస్‌బీట్స్, బోట్, ఫ్రాంటెక్, రీకనెక్ట్, ఇంటెక్స్ తదితర కంపెనీల సౌండ్ సిస్టమ్‌లు ఉన్నాయి.
- మీడియం విభాగంలో రూ.50 వేల నుంచి రూ.లక్ష.. 65 అంగుళాల్లో సోనీ, ఎల్జీ, శ్యాంసంగ్, టీసీఎల్, హయర్, వూ, క్యాండీ, ఏసర్, ఇఫాల్కన్, హైసెన్స్, ఎంఐ తదితర కంపెనీల క్యూఎల్ఈడీ, క్రిస్టల్ యూహెచ్డీ, ఓఎల్ఈడీ టీవీలు.. యమహా, ఎల్జీ, సోనీ, మివి, జీబ్రానిక్స్, జేబీఎల్, బోట్, లాగిటెక్ తదితర కంపెనీల సౌండ్ సిస్టమ్ లభ్యమవుతున్నాయి.
- ప్రీమియం విభాగంలో రూ.లక్ష నుంచి రూ.5 లక్షలు అవుతుంది. సోనీ, శ్యాంసంగ్, ఎల్జీ తదితర కంపెనీల 65 అంగుళాల ఓఎల్ఈడీ టీవీలు, ఇతర బ్రాండ్లలో 65 అంగుళాలపైన ఓఎల్ఈడీ, మినీ ఎల్ఈడీ టీవీలు, బోవర్స్-విల్కిన్స్, ఎలాక్, సోనీ, ఎల్జీ, బాస్, హార్మన్, గాలో, ఫోకల్, ఓంక్యో, జేబీఎల్ తదితర కంపెనీల సౌండ్ సిస్టమ్‌లు ఉన్నాయి.
- లగ్జరీ విభాగంలో రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల పైన.. సోనీ, ఎల్జీ, శ్యాంసంగ్, టీసీఎల్, తోషిబా, హైసెన్స్ తదితర కంపెనీల 85 అంగుళాలు, ఆపైన మినీ ఎల్ఈడీ, క్రిస్టల్ 4కే యూహెచ్డీ, నియో క్యూఎల్ఈడీ 4కే, ఫుల్ ఎరే తదితర రకాల తెరలతో లభిస్తున్నాయి. డెనాన్, మరాంతజ్, మార్టిన్ లోగన్, బ్యాంగ్ లోఫ్సెన్, క్యూబ్, బోస్, యమహా, సోనీ, ఎల్జీ, పయనీర్, డెఫినిటివ్, బోయర్స్ వికిన్స్, బెన్క్యు, ప్లాటిన్ మొనాకో, బోస్, జేవీసీ, క్లిప్స్క్ తదితర కంపెనీల సౌండ్ సిస్టమ్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
"ఆ నిద్రగన్నేరు మళ్లీ చిగురించింది - ఆకు తొడిగిన సినిమా చెట్టు"