ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పులివెందుల అరటి టేస్టే వేరబ్బా - ఆరు నెలల్లోనే 5 లక్షలు ! - HIGH DEMAND FOR PULIVENDULA BANANA

పులివెందుల అరటికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్‌ - ఇప్పుడు అంతర్జాతీయంగానూ గిరాకీ

Pulivendula Banana
Pulivendula Banana (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2025, 12:09 PM IST

High Demand for Pulivendula Banana: వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పండించే అరటికి రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగానూ మంచి డిమాండ్‌ ఉంది. నాణ్యమైన "ఏ" గ్రేడు రకం ఇక్కడ లభిస్తున్నందున వ్యాపారులు కొనేందుకు పోటీ పడుతున్నారు. ఇదే అరటికి ఇప్పుడు అంతర్జాతీయంగానూ గిరాకీ ఏర్పడింది. ఫలితంగా టన్ను అరటి ధర అత్యధికంగా 30 వేలు పలుకుతోంది. గడిచిన మూడేళ్లుగా అరటిని సాగు చేస్తూ లాభాలు గడిస్తున్న రైతులు ఈ సారి ధర అధరహో అనిపించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్ జిల్లాలో రైతులు పండించే అరటికి దశాబ్దాలుగా మంచి గిరాకీ ఉంది. పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, తొండూరు, వేంపల్లె, వేముల మండలాల్లో రైతులు అరటిని విస్తారంగా సాగు చేస్తారు. ‍జిల్లా వ్యాప్తంగా 20 వేల హెక్టార్లలో అరటి సాగవుతుండగా, ఒక్క పులివెందుల నియోజకవర్గంలోనే 12 వేల హెక్టార్లలో ఈ పంట ఉంది. వంద శాతం బిందు సేద్యం, టిష్యూకల్చర్‌తో పాటు ఆకుమచ్చ తెగులు లేని పంట కావడంతో వ్యాపారస్తులు ఈ అరటిని కొనేందుకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. పులివెందుల నుంచి 80 శాతం పంట అంటే 7 లక్షల టన్నుల అరటి ఏటా దిల్లీకి ఎగుమతి అవుతోంది.

కేవలం 6 నెలల్లోనే 5 లక్షల ఆదాయం:దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం ఏటా ఇక్కడి నుంచే జరుగుతోంది. తాజాగా దిల్లీ మార్కెట్‌కే కాక మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకూ ఎగుమతి అవుతోంది. అక్కడి నుంచి సముద్ర మార్గాన విదేశాలకు తరలి వెళ్తోంది. కువైట్, సౌదీ ప్రాంతాలకు ఈ అరటిని ఎగుమతి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పులివెందుల అరటికి డిమాండ్ వచ్చింది. ఏ గ్రేడు అరటి టన్ను ధర 25 వేల నుంచి 30 వేలు పలుకుతోంది. ఎకరా అరటి పంటకు పెట్టుబడి కింద 3 లక్షలు ఖర్చు చేస్తే, 20 నుంచి 25 టన్నులు దిగుబడి వస్తోంది. తాజా ధరలతో లెక్కిస్తే ఎకరాకు 8 లక్షల ఆదాయం వస్తోంది. ఖర్చులు 3 లక్షలు మినహాయిస్తే 5 లక్షలు లాభమే. కేవలం 6 నెలల్లోనే ఎకరాకు 5 లక్షల వరకు రైతులకు ఆదాయం వస్తోందని అధికారులు చెబుతున్నారు.

గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం, చిత్రావతి రిజర్వాయర్‌కు పుష్కలంగా నీరు విడుదల చేయడంతో పాటు పులివెందుల బ్రాంచ్ కెనాల్​కు సాగు నీరు నిరంతరం సరఫరా అవుతోంది. దీంతో అరటి రైతులు విరివిగా పంటలు సాగు చేస్తున్నారు. ఎర్రనేలలు, రాళ్లనేలల్లోనూ సిరులు పండిస్తున్నారు. ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకు అరటి పంట సాగు చేస్తారు. జనవరి నుంచి కోత మొదలు పెడతారు. తొలిసారి కోతకు వచ్చిన అరటి పంట మంచి ధర పలుకుతోంది. రెండోసారి కోతకు వచ్చిన రెండో రకం పంటకు కాస్త ధర తగ్గుతోంది. ఇపుడు మొదటిరకం అరటి టన్ను ధర 30 వేలు, రెండోరకం అరటి 20 వేలు పలుకుతోంది.

ధర 20 వేలకు ఏమాత్రం తగ్గకపోవచ్చు: అరటి గెలలతో కలిపి తోటను కొనుగోలు చేయడం ఒకటైతే గెలల నుంచి హస్తాలను వేరు చేసి ప్యాక్ చేసుకుని తరలించడం మరో పద్ధతి. వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడికే వచ్చి లారీల్లో అరటిని కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఈసారి అరటి పంటకు మంచి ధర ఉండడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అరటి ధర మరో 15 రోజులు ఇలాగే ఉంటుందని వ్యాపారులంటున్నారు పంట కోత పూర్తయ్యే నాటికి టన్ను ధర 20 వేలకు ఏమాత్రం తగ్గకపోవచ్చని చెబుతున్నారు.

"రైతులకు లాభసాటిగా ఉండటం వలన పులివెందుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అరటి సాగు చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ కంట్రీలకు ఎక్కువగా ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం గెలలతో పాటు అయితే టన్ను 20 వేల రూపాయలు ఉంది. హస్తాలుగా వేరు చేసుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తే టన్ను 25 వేల వరకూ పలుకుతోంది". - రాఘవేంద్ర, ఉద్యాన శాఖ అధికారి

అన్నమయ్య జిల్లా టూ అండమాన్​ దీవులకు- టమాటాల ఎగుమతితో రైతన్నకు లాభాలు

అరబ్​ దేశాలకు అనంతపురం అరటి

ABOUT THE AUTHOR

...view details