RGV Case Trial in High Court : అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సినీ డైరక్టర్ రాం గోపాల్ వర్మకు హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వర్మ తరపు న్యాయవాది చేసిన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. తనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని వర్మ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్ట్ విషయంలో ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మంగళవారం విచారణ హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని, హాజరు అయ్యేందుకు మరి కొంత సమయాన్ని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని వర్మ తరపు న్యాయవాది కోర్టను కోరారు. విచారణకు హాజరుకావాలనే విషయంలో సమయం పొడిగింపు కోసం పోలీసులు ముందు అభ్యర్థన చేసుకోవాలని, కోర్టు ముందు కాదని న్యాయస్థానం స్పష్టం తెలిపింది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా X లో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.