High Court on Perni Nani Petition Withdrawn :గోదాము నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టు వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్ని నాని, ఆయన కుమారుడు దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం పరిశీలించింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు. గడువు ముగిసినందున పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని, తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు.
మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని సతీమణి జయసుధ మచిలీపట్నంలోని తన గోదామును పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయం అయ్యాయని చింతం కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో జయసుధ బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ప్రాసిక్యూషన్ తరపున ఇవాళ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయ సెలవు పెట్టారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హాజరుకాకపోవటంతో పిటిషన్‌ను న్యాయమూర్తి ఈనెల 27కు వాయిదా వేశారు. అలాగే కౌంటర్ దాఖలు విషయంలో పోలీసుల తీరుపై జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు.