ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉచిత చికెన్​ ఫుడ్​ మేళా - బారులు తీరిన జనం - గేట్లు మూసివేత - FREE CHICKEN FOOD MELA

ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చికెన్ ఫుడ్ మేళా - భారీగా తరలివచ్చిన జనం - నిండిపోయిన ప్రాంగణం

Chicken Food Mela in Guntur
Chicken Food Mela in Guntur (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2025, 2:06 PM IST

Chicken Food Mela in Guntur: బర్డ్ ఫ్లూ పట్ల ప్రజలు అపోహలు వీడాలని మాజీమంత్రి, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మినారాయణ అన్నారు. బాగా ఉడికించిన చికెన్, గుడ్లు తినటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. బర్డ్ ఫ్లూపై ప్రజల్లో నెలకొన్న అపోహలు తొలగించేందుకు ఫౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన చికెన్ ఫుడ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి 70 డిగ్రీల కంటే ఎక్కువ వేడిపై ఉడికిస్తే ఎలాంటి వైరస్ ఉండదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పేదవాళ్లకు తక్కువ ఖర్చులో దొరికే నాన్ వెజ్​ చికెన్ మాత్రమేనని దాన్ని అపోహలతో దూరం చేయొద్దని కోరారు.

వ్యాపారులు కూడా చికెన్ సెంటర్లలో అవగాహనా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని పశుసంవర్ధకశాఖ అధికారులు తెలిపారు. అన్ని పౌల్ట్రీ ఫారాలు పరిశీలించి ఈ మేరకు నిర్ధారించినట్లు పశువ్యాధి నిర్ధారణ విభాగం అదనపు సంచాలకులు మాధవి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారం వల్లే చికెన్ అమ్మకాలు పడిపోయాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు.

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ అమ్మకాలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో వాస్తవాలు చెప్పేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, పౌల్ట్రీ ఫెడరేషన్ నిర్ణయించాయి. చికెన్ ఫుడ్ మేళా ఏర్పాటు చేసి బిర్యానీతో పాటు గుడ్లు, చికెన్ వంటకాలను వడ్డించారు. స్వామి ధియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసివేశారు. ఉచితంగా చికెన్ తినొచ్చన్న ప్రచారంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా అక్కడకు చేరుకున్నారు. అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జనం తరలిరావటంతో ఇకపై చికెన్ అమ్మకాలు ఊపందుకుంటాయని పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రతినిధులు భావిస్తున్నారు.

ఆందోళన వద్దు - ఆ ప్రాంతాల్లో మినహా నిరభ్యంతరంగా ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చు

రాష్ట్రంలో బర్డ్‌ ఫ్లూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు: సీఎస్‌ విజయానంద్‌

ABOUT THE AUTHOR

...view details