Rains in Tirupati District : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను అందుబాటులో ఉంచారు.
ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా అతలాకుతలం అవుతోంది. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, పెళ్లకూరు, తడ, ఓజిలి దొరవారిసత్రం, సూళ్లూరుపేట మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలైన సూళ్లూరుపేట, తడ, చిట్టమూరు, కోట వాకాడు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పునరావాస కేంద్రాలు పరిశీలించారు. బాధితులకు అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
Heavy Rains in AP : శ్రీకాళహస్తి నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏర్పేడు మండలంలోని పాపా నాయుడుపేట-గుడిమల్లం ప్రధాన రహదారిపై సీతకాలువ వాగు వరద చేరడంతో కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నదికి వరద పోటెత్తడంతో ఏర్పేడు-మోదుగులపాలెం కాజ్వే పై వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. పలు కాజ్వేల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.