Rains in Andhra Pradesh :పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు వాయువ్య బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అల్పపీడనం క్రమేపీ బలహీన పడుతోందని ప్రకటించింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని ఒకటి రెండు చోట్ల భారీగాను, చాలా చోట్ల వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర కోస్తాలో చాలా చోట్ల నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. మంగళవారం విజయవాడలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. దీనికితోడూ మురికి కాలువలు పొంగి పొర్లడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నీట మునిగిన పంటపొలాలు : మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అనకాపల్లి జిల్లా పరవాడ పైడితల్లి అమ్మవారి గుడికి అనుకుని ఉన్న చెరువుకు గండి పడింది. దీంతో వరి పొలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నీటమునిగిన పొలాలను చూసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడంతా వరద పాలైందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలో వాన దంచికొట్టింది వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బ్రహ్మంగారిమఠం సమీప సోమిరెడ్డిపల్లె వద్ద వంక పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా బద్వేలు-బ్రహ్మంగారిమఠం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
బద్వేల్ మున్సిపాలిటీలో రాత్రి కురిసిన వర్షానికి వీధులు జలమయ్యాయి. దీంతో ప్రజలు బయటకి వెళ్లేందుకు జంకుతున్నారు. తప్పని పరిస్థితుల్లో వరద నీటిలో రాకపోకలు సాగించాల్సి వస్తుందని స్థానికులు అంటున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.