ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బీ అలర్ట్' - విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు - విద్యాసంస్థలకు సెలవులు - HEAVY RAINS IN AP

తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు - మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న విపత్తుల నిర్వహణ సంస్థ

Heavy_Rains_in_AP
Heavy Rains in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2024, 9:51 AM IST

Heavy Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

పునరావాస కేంద్రాలకు తరలింపు: మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడుడుతున్నాయి. నెల్లూరు జిల్లాలో రెండో రోజూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 25 మండలాల్లో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు దంచికొడుతున్నాయి. వెంకటగిరి, నెల్లూరులో ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అధికారులు సిద్ధం చేశారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు, గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో 146 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో భోజనం వసతి ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.

నెల్లూరు జిల్లాలో రాత్రి ఉరుములు పిడుగులతో వర్షం కురిసింది. సోమవారం రాత్రి వరకు జలదంకిలో అత్యధికంగా 18.3 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది. అల్పపీడనం ప్రభావంతో 16 మండలాల్లో అత్యధిక వర్షం కురిసింది. విడవలూరు 17.3 సెం.మీ, అల్లూరులో 15.4 సెం.మీ, కావలి 15.1 సెం.మీ, కొడవలూరులో 14 సెం.మీ, బోగోలు 13.8 సెం.మీ, కందుకూరులో 13.2 సెం.మీ, సంగం 12.6 సెం.మీ, దగదర్తిలో 12 సెం.మీ, కోవూరులో 11.6 సెం.మీ, బుచ్చిరెడ్డిపాళెంలో 11.6 సెం.మీ, కలిగిరి 10.9 సెం.మీ, అనంతసాగరంలో 10.7 సెం.మీ, ఉలవపాడు 10.3, నెల్లూరు గ్రామీణంలో 10.2 సెం.మీ, ముత్తుకూరులో 10.2 సెం.మీ. వర్షపాతం నమోదు అయింది.

ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ - తుపానుగా మారుతున్న తీవ్ర అల్పపీడనం

వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు: ప్రకాశం జిల్లాలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి . జిల్లా వ్యాప్తంగా పొన్నలూరు, పామూరు, ఒంగోలు, సింగరాయకొండ మండలంలో అత్యధిక వర్షపాతం నమోదయింది. వర్షాల కారణంగా రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయం మయ్యాయి. గుండ్లకమ్మ, కొత్త వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సింగరాయకొండ, కొత్తపట్నం, ఒంగోలు, టంగుటూరులలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా ఈరోజు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు వర్షాలు కురుస్తున్న ప్రాంతాలను పరిశీలించారు. జొన్న, సజ్జ పంటలకు నష్టం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది.

బాపట్ల జిల్లాలో రెండో రోజు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, చీరాల వేటపాలెం, చినగంజాం, కారంచేడు, పర్చూరు, మార్టూరు, ఇంకొల్లు ప్రాంతాల్లో అలాగే చుండూరు, వేమూరు, అద్ధంకి, యద్దనపూడి, నిజాంపట్నం, కర్లపాలెం ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో కురుస్తున్న వర్షాలకు రహదార్లు జలమయమయ్యాయి.

భారీ వర్షాలు కారణంగా తిరుపతి జిల్లా కోస్తా తీరప్రాంతంలో విద్యాసంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. సూళ్లూరుపేట, కోట, వాకాడు, చిల్లకూరు, తడ మండలాల్లో విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ఇచ్చారు. విద్యాసంస్థల యాజమాన్యాలు విధిగా సెలవు అమలు చేయాలన్న కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో 3 రోజల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

4 రోజుల పాటు భారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు:మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పష్టం చేశారు. తదుపరి 2 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాల వైపు కదులుతుందన్నారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, పలుచోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రెడ్‌ అలర్ట్‌ జారీ: తీరం వెంబడి గంటకు 35-55 కిమీ వేగంతో ఈదురుగాలులు విస్తున్నాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్‌, అన్నమయ్య జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయింది. 17వ తేదీన చెన్నై సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

బంగాళాఖాతం ఉగ్రరూపం ! - పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు - ఇక నెలంతా తుపాన్లే

ABOUT THE AUTHOR

...view details