Heavy Rains In AP :రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు విస్తారంగా కురిశాయి. కొన్ని రోజులుగా భారీ ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఉపాశమనం లభించింది. ముఖ్యంగా భారీ వర్షాల వల్ల అల్లూరి జిల్లా పాడేరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాదాపు నాలుగు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ నీటితో నిండిపోయింది. బస్ షెల్టర్‌లోకి వర్షపు నీరు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానిక ITDA గృహ సముదాయం వద్ద ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణంలో పలు చోట్ల రహదారులు, కాలువల్లో వర్షాపు నీరు భారీగా ప్రవహించింది.
లోతట్టు ప్రాంతాలు జలమయం : పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు కారణంగా వరహాలగడ్డలో ప్రవాహం పెరిగింది. అలాగే వర్షపు నీటితో గణేష్ నగర్ కాలనీలో రహదారులు పూర్తిగా ముంపును గురయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పర్యటించారు. ఈ సందర్భంగా ముంపుకు గల కారణాలపై ఆరా తీశారు. దశాబ్ద కాలంగా గణేష్ నగర్ కాలనీ ముంపును గురవుతుందని స్థానికులు ఎమ్మెల్యే తెలియజేశారు. వారి సమస్యలు విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి వర్షపు నీరు దిగువకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇళ్లల్లోకి చేరిన వర్షపు నీరు : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో భారీ వర్షం కురిసింది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. టవర్ క్లాక్ వద్ద వర్షపు నీరు నిలచిపోవడంతో పాదచారులు, వాహనదారులు వర్షపు నీటిలో వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జైనబీ దర్గా వద్ద రహదారిపై వర్షపు నీరు నిలవడంతో పలు ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.