AP Rains Today 2024 :రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు, కాలనీలు వరదలో చిక్కుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాను వరద నీరు ముంచెత్తింది. విజయవాడలోని బుడమేరు కట్ట, అంబాపురంపైన ఉన్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగడంతో నగరంలోని సుందరయ్య నగర్, రాజీవ్‌నగర్, ప్రకాశ్‌నగర్ పైపుల రోడ్డు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నున్న ప్రాంతంలోని అగ్నిమాపకశాఖ సిబ్బంది ఇళ్లు నీట మనిగాయి.
తప్పిన పెనుప్రమాదం : జక్కంపూడి, కొత్తూరు, తాడేపల్లి గ్రామశివారు ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒక్కసారిగా భారీ వరద వచ్చింది. పలు ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలలో పనిచేసే కార్మికులు అందులో చిక్కుకుపోయారు. సుమారు 6 అడుగుల మేర నీరు చేరుకుంది. దీంతో స్థానికులు ఇళ్ల పైకి ఎక్కి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జక్కంపూడి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో అర్ధరాత్రి నాలుగు అడుగులపైగా వరద నీరు చేరగా పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం తప్పింది.
Heavy Rains in Andhra Pradesh : విజయవాడ బస్టాండ్ వద్ద రైల్వే అండర్‌పాస్ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో అక్కడ నిలిపిన 4 బస్సులు నీట మునిగాయి. దీంతో అధికారులు భారీ మోటార్ల ద్వారా నీటిని కృష్ణా నదిలోకి పంపింగ్ చేశారు. అనంతరం బస్సులను క్రేన్ల సాయంతో బయటకు తీశారు. రైల్వేట్రాక్ కింది నుంచి కనకదుర్గ పైవంతెన మీదుగా వెళ్లే మార్గాన్ని పునరుద్ధరించారు. తద్వారా విజయవాడ-హైదరాబాద్ మార్గంలో బస్సులు నడుస్తున్నాయి.
అల్లూరి జిల్లావ్యాప్తంగా వర్షాలు : అల్లూరి జిల్లావ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఘాట్‌రోడ్లలో భారీ వాహనాలకు అనుమతి లేదని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంపచోడవరం ముంపు ప్రాంతంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.