Heavy Rains in Andhra Pradesh State: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో శుక్ర శనివారాలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు రోణంకి కూర్మనాద్ చెప్పారు.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Rains in Andhra Pradesh (ETV Bharat) వాయుగుండంగా బలపడే అవకాశం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ ఆదివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే ఆదివారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలినచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు. కోస్తాతీరం వెంబడి గంటకు 45-55 కిమీ వేగంతో ఈదురుగాలులు వియనున్నాయని, శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ప్రకటించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం - రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు - Low Pressure in Bay of Bengal