People Problems due to Heavy Rains:రాజధాని హైదరాబాద్ మహానగరంలో చినుకు పడితే చాలు చిత్తడే. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. డ్రైనేజీలు జలమయంగా మారి చిన్నపాటి వాగుల్లా పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం కురిసిన భారీ వానకు నగరం తడిసిముద్దయింది. కురిసింది కొద్ది గంటలే అయినా ప్రజల్ని నానా ఇబ్బందులు పెట్టింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు తెగ ఇబ్బందులు పడ్డారు.
మరోవైపు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దీంతో చిన్నారులను బడులకు పంపేందుకు వారి తల్లిదండ్రులు ఆపోసోపాలు పడ్డారు. ఈ క్రమంలోనే యూసఫ్‌గూడ శ్రీ కృష్ణానగర్‌లో కొన్ని సంఘటనలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి. తమ పిల్లలను వరదలో తడవకుండా ఎత్తుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి. కాసేపు దంచికొట్టిన వానతో నగరం అస్తవ్యస్తమైంది.