Heavy Rain Forecast for Coastal Districts: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు అల్పపీడనం పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్పపీడనం మళ్లీ బలపడుతుందా లేకుంటే బలహీనపడుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం తీరానికి సమీపంలో కదులుతున్న నేపథ్యంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని, చలిగాలులు వీస్తున్నాయి.
తీవ్ర అల్పపీడన ప్రభావంతో గురువారం వరకు కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. అదే విధంగా ఈ రోజు మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నట్లు పేర్కొన్నారు.
అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో గరిష్ఠంగా గంటకు 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో బుధవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం సహా తమిళనాడులోని వివిధ పోర్టుల్లో 3వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.