Heavy Loss to Farmers Due to Power Cuts:రాష్ట్రంలో వేసవి ఆరంభంలోనే విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ప్రధానంగా వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్‌లో అధికారికంగా రోజుకు 2 గంటలపాటు జగన్ ప్రభుత్వం కోత పెట్టింది. గత మూడేళ్లుగా కోతలతో వైసీపీ సర్కారు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎన్నికల ఏడాది కావడంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు భావించినా, విద్యుత్ సంస్థల తీరు అందుకు అనుగుణంగా లేదు. లోడ్ సర్దుబాటు, నిర్వహణ పనుల కోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల పరిధిలో సైతం అడపాదడపా కోతలు విధిస్తున్నారు. ఎండలు పెరిగేకొద్దీ కోతలు లేకుండా ప్రభుత్వం విద్యుత్ ఇస్తుందా అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
తెలంగాణలో వెలుగులు - ఏపీలో చీకట్లు - విద్యుత్ రంగంలో ఆంధ్రావని వెనకబాటు
ఫిబ్రవరి 14న గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 12 వేల 470 మెగావాట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో ఉన్న డిమాండ్‌తో పోలిస్తే 720 మెగావాట్లు అదనం. దీనికి అనుగుణంగా సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు తంటాలు పడుతున్నాయి. గతేడాది అక్టోబరు 19న నమోదైన 13వేల39 మెగావాట్లు ఇప్పటి వరకు గ్రిడ్ గరిష్ఠ డిమాండ్‌గా ఉంది. ఈ ఏడాది మే, జూన్‌లో గత రికార్డులను తిరగరాస్తూ గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ 14 వేల మెగావాట్లు దాటే అవకాశం ఉందని అధికారుల అంచనా. ప్రస్తుతం రిజర్వాయర్లలో నీరు లేకపోవడంతో వారం కిందటి వరకు 11.38 ఎంయూలుగా ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం 0.69 ఎంయూలకు మించి రావడం లేదు. దీంతోపాటు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గుల కారణంగా గ్రిడ్ నియంత్రణకు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తోంది.
గత వారం నుంచి విద్యుత్ వినియోగం రోజూ కనీసం 2 ఎంయూల చొప్పున పెరుగుతోంది. రాష్ట్రంలో శుక్రవారం నాటికి వినియోగం 228.04 ఎంయూలకు చేరింది. ఇది ఫిబ్రవరి నెలాఖరుకు 250 ఎంయూలకు చేరే అవకాశం ఉందని అధికారుల అంచనా. అది క్రమేణా పెరుగుతూ మే, జూన్ నాటికి 270 ఎంయూలు దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. జెన్‌కో థర్మల్, జల విద్యుత్, అందుబాటులో ఉన్న ఇతర వనరుల ద్వారా 220 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్‌కు అందే అవకాశం ఉంది.