ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నిధుల కోసం కేంద్రానికి విజ్ఞప్తి చేయాలి - ఏపీతో పోలిస్తే ఇతర రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపు' - andhra pradesh news

HC on court buildings: కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలను పూర్తి చేసేందుకు 60 శాతం వాటాగా ఇవ్వాల్సిన 394 కోట్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కేటాయించిన నిధులు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసింది.

HC_on_court_buildings
HC_on_court_buildings

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 7:29 AM IST

HC on Court Buildings: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు భవనాలు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు సంబంధించిన 19 ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 60% వాటాగా ఇవ్వాల్సిన 394 కోట్ల రూపాయల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏపీతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు కేటాయించిన నిధులు చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేసింది.

రాష్ట్రంలో 19 జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్‌ ప్రాజెక్టులు చేపట్టారని, వాటిలో ఎక్కువ శాతం నిధులు కొరత, కేటాయింపులు జరగకపోవడం వల్ల నిలిచిపోయాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్ఛర్‌ కోసం కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వాటా సొమ్మును భరించాల్సి ఉందని తెలిపింది. 19 ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం మొత్తం 656 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని, అందులో కేంద్ర ప్రభుత్వ వాటా 394 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టికి తీసుకొచ్చిందని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) బి. నరసింహశర్మ వాదనలు వినిపించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, సొమ్ము విడుదలకు చర్యలు తీసుకుంటానని, అక్కడ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేస్తానన్నారు. అందుకు కొంత సమయం కావాలన్నారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.

'మహా కుంభాభిషేకానికి వారంలోగా ముహుర్తం నిర్ణయించాలి' - దేవాదాయశాఖ కమిషనర్​కు హైకోర్టు ఆదేశం

ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరంలో కొత్త కోర్టు భవనాన్ని నిర్మించకపోవడం, పాత కోర్టు భవనానికి కనీస మరమ్మతులు చేపట్టకపోవడాన్ని సవాలు చేస్తూ గన్నవరం మండలం వీరపనేనిగూడేనికి చెందిన దేవిరెడ్డి రాజశేఖరరెడ్డి 2022లో హైకోర్టులో పిల్‌ వేశారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణ ప్రాజెక్టుల పరిస్థితులపై దృష్టి సారించింది.

కొన్ని భవనాలు అయిదేళ్ల కిందట ప్రారంభమైనా ఇప్పటికి 10 శాతం పనులు పూర్తికాలేదని గత విచారణలో అందోళన వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎమ్మార్కే చక్రవర్తి వాదనలు వినిపించారు. ఏపీతో పోలిస్తే ఇతర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ స్థాయిలో నిధులు విడుదల చేసిందన్నారు. నిధుల కేటాయింపు జరగక రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాలలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ డైరెక్టర్‌ ఈ ఏడాది జనవరి 19న రాసిన లేఖ ప్రకారం తదుపరి విడత సొమ్ము విడుదల వ్యవహారాన్ని పరిశీలిస్తున్నట్లు ఉందని ధర్మాసనం పేర్కొంది. ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఏపీకి రూ 19.26 కోట్లు కేటాయించారని, మొదటి విడతగా అందులో రూ 4.82 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం కేటాయించిన సొమ్ములో ఇంకా రావాల్సిన రూ 14.44 కోట్లు విడుదల చేసినా 19 ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు ఆ సొమ్ము సరిపోదని పేర్కొంది. ఈ వ్యవహారాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌కు స్పష్టం చేసింది. విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.

విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపు కేసు - ఎంత స్థలం కేటాయించారో వివరాలివ్వండి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details