Haindava Sankharavam Sabha: ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, దేవదాయ-ధర్మాదాయ శాఖను రద్దు చేయాలని హైందవ శంఖారావం సభ డిమాండ్ చేసింది. విశ్వహిందూ పరిషత్ నిర్వహించిన శంఖారావానికి హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక, సేవా సంఘాల ప్రతినిధులు, పీఠాధిపతులు విచ్చేశారు. భారీసంఖ్యలో హిందువులు తరలివచ్చారు. కాషాయ జెండాల రెపరెపలతో సభా ప్రాంగణం కళకళలాడింది. హిందూధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని ఆధ్యాత్మికవేత్తలు పిలుపునిచ్చారు.
విజయవాడ సమీపంలోని కేసరపల్లి కాషాయవర్ణం సంతరించుకుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. భరతమాత చిత్రపటం వద్ద వీహెచ్‌పీ నేతలు, పీఠాధిపతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. శంఖారావం బహిరంగసభ ప్రారంభానికి ముందు పండితులు వేద మంత్రోచ్ఛరణ, సామూహిక ఏకతామంత్ర ఆలాపన చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
'హిందూధర్మ పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి' - కేసరపల్లిలో రెపరెపలాడిన కాషాయ జెండాలు (ETV Bharat) హిందూ దేశంలో పుట్టడం మన భాగ్యం:ఆలయ వ్యవస్థ సరిగా సాగకపోతే జీవితానికి అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదని చినజీయర్ స్వామి అన్నారు. ఆలయాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రభుత్వ అధికారి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. హిందూ దేశంలో పుట్టడం మనం చేసుకున్న భాగ్యమని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానందస్వామి అన్నారు. దేశంలో ఎన్నో పుణ్యనదులు, పర్వతాలు ఉన్నాయని సాంప్రదాయాల్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
"మనం మన ఆలయాలు అవి చిన్న గ్రామంలో చెట్టు కింద ఉన్న అమ్మవారు అయినా, ఎప్పటి నుంచో ఉన్న పెద్ద ఆలయమైనా అక్కడ జరిగే విధానాలను నిర్ణయించే పెద్దలు ఉన్నారు. వారి ఆదేశాలకు విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు". - చినజీయర్ స్వామి, ఆధ్యాత్మికవేత్త
ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకోవడం సరికాదు: ఆలయ భూముల కబ్జాలు, అర్చకులపై దాడులు, హుండీల దొంగతనం వంటి ఘటనలు జరగడం దారుణమని కమలానంద భారతి అన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవాలయాల నిర్వహణ బాధ్యతలు హిందువులకే ఉండాలని వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు అన్నారు. దేవాలయాలను ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకోవడం సరికాదన్నారు.
1987లో తీసుకొచ్చిన హిందూ దేవాదాయ, ధర్మదాయ చట్టం ధర్మకర్తలు, అర్చకులకు అశనిపాతంగా మారిందని మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఈ చట్టంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. హైందవ ధర్మంపై సినీ పరిశ్రమలో దాడి జరుగుతోందని గీత రచయిత అనంత శ్రీరామ్ ఆందోళన వ్యక్తంచేశారు. సినీరంగం తరఫున హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పారు. హైందవ శంఖారావం సభకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పోటెత్తారు. బస్సులు, రైళ్లలో, వాహనాల్లో తరలివచ్చారు. హిందువుల రాకతో విజయవాడకు వచ్చే మార్గాలు కిక్కిరిశాయి.
'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - హైందవ శంఖారావంలో అనంత శ్రీరామ్