Guru Pournami Celebrations in AP:గురు పౌర్ణమి వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఉదయం 6 గంటల నుంచి సాయి మందిరాల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రం పార్వతీపురంలో పలు సాయి మందిరాల్లో భక్తులు తమ స్వహస్తాలతో స్వామికి క్షీరాభిషేకం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
విజయవాడలోని వేద పాఠశాలలో శ్రీ వేదవ్యాస మహర్షికి గురుపూజ చేశారు. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామివారికి, బ్రహ్మశ్రీ యోగానంద వీరధీర సుందర హనుమత్ శాస్త్రికి గురుపాదుకార్చన నిర్వహించారు. గుంటూరులోని పలు సాయిబాబా ఆలయాల్లో గురుపూజ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. శ్రీగణపతి దత్తాత్రేయ సహిత శ్రీ సాయినాథ ఆలయంలో బాబాకు పంచామృతాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళా బృందం పాడిన గీతాలు భక్త జనంలో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించాయి.
నంద్యాలలో వెలిసిన సాయిబాబా ఆలయంలో బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారిని బంగారు వర్ణంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. బొమ్మల సత్రంలోని బాబా ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించారు. కర్నూలులో బాబా ఆలయాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో వేడుకలు జరుపుకొన్నారు. యోగా శిక్షణా కేంద్రాల్లో గురు పౌర్ణమి జరుపుకొని గురువులను సన్మానించారు. పతాంజలి యోగా శిక్షణ కేంద్రంలో యోగా గురువు పెరుమాళ్ల దత్తయ్య గురువు విశిష్టతను వివరించారు.
గురుపౌర్ణమి పేరు ఎలా వచ్చిందో తెలుసా! ఈ రోజు ఏం చేయాలంటే? - Gurupournami special
అనంతపురం జిల్లా వ్యాప్తంగా సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే బాబాకు అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు కొనసాగాయి. సాయి నామస్మరణలతో ఆలయాలు మార్మోగాయి. ఉరవకొండలోని సాయిబాబా ఆలయంలో వివిధ రకాల పుష్పాలతో భక్తులను ఆకట్టుకునేలా అలంకరించారు. బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఆలయం కిటకిటలాడింది. సాయిబాబా, గురు దత్తాత్రేయ స్వామివారికి భక్తులు పాలాభిషేకం చేశారు. బాబా దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోగురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయినామస్మరణలతో వేకువజాము నుంచే బాబా మందిరాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. బాబా విగ్రహాలకు భక్తులు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు. అమలాపురం, మలికిపురం, పి.గన్నవరం, బండారులంక, రాజోలు, అంబాజీపేట తదితర ప్రాంతాల్లోని సాయిబాబా ఆలయాలలో భక్తజనం పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని బాబా మందిరాలు సాయి నామ స్మరణతో మార్మోగాయి. పట్టణంలోని వాణి వీధి, హిందూపురం కూడలి, కోనేరు వద్ద గల సాయిబాబా మందిరాలలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాబా బోధనలతో పరిసరాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బాబా దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కోనేరు వద్ద ఉన్న దత్త సాయి ట్రస్ట్ కమిటీ సభ్యులు పేదలు, వృద్ధులకు వస్త్ర దానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాడే వీధిలోని బాబా మందిరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
గురుపౌర్ణమి ఎలా జరుపుకోవాలి? గురువుకు పసుపు రంగుకు ఏంటి సంబంధం? - Guru Purnima 2024