TG Group 1 Exams 2024: తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజైన సోమవరాం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగింది. అభ్యర్థులను ఒకటిన్నర గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. 2 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా వారిని కేంద్రాల్లోకి అనుమతించలేదు. కోఠి మహిళా కళాశాల పరీక్షా కేంద్రానికి 2నిమిషాలు ఆలస్యంగా వచ్చిన యువతిని అధికారులు లోపలికి అనుమతించలేదు. వరంగల్ నుంచి వచ్చానని, పరీక్ష కేంద్రంలోకి పంపించాలని యువతి ఏడ్చినా అధికారులు అనుమతించలేదు.
మరోవైపు సికింద్రాబాద్ పీజీ కళాశాలకు నిమిషం ఆలస్యం వచ్చిన అభ్యర్థిని, పోలీసులు వెనక్కి పంపారు. దాంతో అతను గోడ దూకి పరీక్షా కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని అడ్డుకొని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రధాన పరీక్ష కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 8, రంగారెడ్డిలో 11, మేడ్చల్ జిల్లాలో 27 కేంద్రాలను ఏర్పాటు చేశారు. నగర పోలీసులు సైతం పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఒక ఎస్సై, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక మహిళా కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభమైన దగ్గరి నుంచి పూర్తయ్యే వరకూ విధుల్లో ఉంటారు. అదనంగా ఒక పోలీస్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలు, జవాబు పత్రాలు తరలించే వాహనాలకు టీజీపీఎస్సీ తొలిసారిగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఉపయోగిస్తోంది. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల దూరంలో జిరాక్స్, ఇంటర్‌నెట్ దుకాణాలు మూసివేయించారు. 200 మీటర్ల దూరం వరకూ 144 సెక్షన్ అమలు చేశారు.
విద్యార్థుల పిటిషన్పై సుప్రీంకోర్టు: మరోవైపు తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఆదేశాలను సవాలు చేస్తూ, దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ముగిస్తూ ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది.