Green Field National Highway :హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య దూరం తగ్గేలా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులు ఏలూరు జిల్లా రైతులకు తలనొప్పిగా మారాయి. పరిహారం విషయంలో ఇప్పటికే అనేక సార్లు రోడ్డెక్కిన రైతులు ఇప్పుడు మిగిలిన పంట పొలాలను ముంపు నుంచి కాపాడుకునేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం పూర్తయితే భవిష్యత్‌లో పొలాలకు వెళ్లే దారి కోసం పోరాడాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమయ్యే గ్రీన్ ఫీల్డ్ హైవే దేవరపల్లి మీదుగా సాగి రాజమహేంద్రవరం వెళ్తుంది. 162 కిలోమీటర్ల ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు చివరిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖ, రాజమండ్రి వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా వెళ్తుండగా ఈ రహదారి అందుబాటులోకి వస్తే దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
రాష్ట్రంలో హైవేలపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణం - మిథున్‌రెడ్డి ప్రశ్నకు గడ్కరి వివరణ
రాష్ట్రంలో ప్రధానంగా ఏలూరు జిల్లా మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి వెళ్తోంది. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలంలోని పలు గ్రామాల మీదుగా వెళ్లే రహదారి కోసం బహిరంగ మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే భూములు సేకరించారు. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున రైతుల నుంచి నిరసన వెల్లువెత్తినా, పలుమార్లు ఆందోళనలు చేసినా అధికారులు, గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రహదారి భూ సేకరణ పరిహారం విషయంలో ఇప్పటికే నష్టపోయిన రైతులకు ఇప్పుడు కొత్త కష్టాలు వెక్కిరిస్తున్నాయి.