DIWALI CELEBRATIONS 2024 :రాష్ట్రవ్యాప్తంగా దీపావళి సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికగా, నరకాసురుడిని సత్యభామ వధించిన గెలుపునకు గుర్తుగా ఇలా పలు విధాల జరుపుకునే దివ్వెల వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. లక్ష్మీదేవి పూజ, నోముల నేపథ్యంలో పూల మార్కెట్లు, టపాసుల దుకాణాలు కిటకిటలాడాయి. చిన్నాపెద్దా పెద్ద బాణసంచా పేలుస్తూ ఆనందోత్సహాలతో గడుపుతున్నారు.
విజయానికి ప్రతీకగా, చీకటిని పారదోలి వెలుగులు తెచ్చే పండుగ దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. పూల దండలు, మామిడి కొమ్మలతో అందంగా అలంకరించిన ఇళ్లన్ని దీపపు కాంతులతో ధగధగలాడుతున్నాయి. పండుగ పూట ప్రత్యేక పూజలు చేసి బంధువులు, స్నేహితులతో కలిసి మిఠాయిలు పంచుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ చిన్నాపెద్దా ఆనందోత్సహాలలో మునిగి తేలుతున్నారు.
తెలుగు లోగిళ్లలో ఆధ్యాత్మిక శోభ :దివ్వెల పండుగ వేళ ఉదయం నుంచి లోగిళ్లన్ని ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ధనత్రయోదశి నాడు ఆరంభమైన వేడుకలు నవంబర్ 3 తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఖజానాను తెరచి భక్తులకు వెండి నాణేలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌లో దీపావళి సంబురాలు ఘనంగా సాగాయి. సిబ్బందితో కలిసి కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ దీపాలు వెలిగించి సంతోషాన్ని పంచుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో :సిద్దిపేట జిల్లా దుబ్బాకలో వ్యాపారులు లక్ష్మీదేవికి వేదమంత్రోచ్ఛరణల మధ్య పూజలు నిర్వహించారు. ఆలయాలను సందర్శించిన భక్తులు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్‌లో గుడులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహాశక్తి ఆలయంలోని ముగ్గురు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.