Grand Welcome To Atchannaidu & Ram Mohan Naidu In Srikakulam :చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి జిల్లాకు తొలిసారి వచ్చిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఆయన బాబాయి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడులకు సిక్కోలు వాసులు అడుగడుగునా నీరాజనం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి స్వగ్రామం నిమ్మాడ వరకు పూలవర్షం కురిపించారు. అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ ర్యాలీ సాగింది.
'జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా. సిక్కోలు వాసుల ఆశీర్వాదంతో చిన్న వయసులోనే కేంద్ర మంత్రినయ్యా. ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా. పరిశ్రమల్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు చూపుతాం. రైల్వే వ్యవస్థ అభివృద్ధికి చొరవ చూపుతా. సాగునీటి ప్రాజెక్టుల పరిష్కారానికి కృషి చేస్తా.' - కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పౌర విమానయాన శాఖ మంత్రి
'సాగునీటి వ్యవస్థను గాడిలో పెడతా : అన్ని శాఖల మంత్రుల సహకారంతో జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. సాగునీటి పారుదల వ్యవస్థను గాడిలో పెట్టి ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం. మత్స్యకారులు వలస వెళ్లకుండా జెట్టీలు నిర్మిస్తాం. చంద్రబాబు సహకారంతో ఇచ్ఛాపురం నుంచి విశాఖ వరకు కోస్టల్ కారిడార్ కింద నాలుగు వరుసల రహదారి నిర్మిస్తాం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ సభాపతి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తాం.. కోడి రామ్మూర్తి స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం. రామ్మోహన్‌నాయుడి ద్వారా కేంద్రం నుంచి జిల్లాకు ఎక్కువగా నిధులు రప్పిస్తాం. ఒకే కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వడం సాధారణ విషయం కాదు. పెద్దల నమ్మకాన్ని కచ్చితంగా కాపాడుకుంటాం.' - అచ్చెన్నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు - రాష్ట్రానికి శుభవార్త - Rammohan Naidu charge as Minister
ఆత్మీయ సత్కారం :జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మైదానంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో మంత్రులను ఘనంగా సత్కరించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకటరమణ, ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి (నరసన్నపేట), ఎన్.ఈశ్వరరావు (ఎచ్చెర్ల), జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, భాజపా నేతలు పాల్గొన్నారు.
ఎన్డీయేలో కీలకంగా ఉన్న చంద్రబాబు వైపే దేశం మొత్తం చూస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని విమానాశ్రయాలనూ అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అన్ని శాఖల నుంచీ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని అధినేత చంద్రబాబు తనకు సూచించినట్లు వెల్లడించారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి శ్రీకాకుళం జిల్లాకు సోమవారం ఆయన తొలిసారి వచ్చారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ మైదానంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోదీ పిలిపించి కీలకమైన విమానయాన శాఖను నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తాం. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన కుటుంబం పడిన బాధ కళ్లారా చూశా. దేవుడు ఆయనకు న్యాయం చేయడానికే అఖండ విజయాన్ని ఇచ్చాడు’ అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండు ఇంజిన్ల సర్కారు ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.
వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు - 'ప్రతీ అధికారి రైతులకు అందుబాటులో ఉండాలి' - Minister Atchennaidu Review Meeting
బాబాయి, అబ్బాయిలకు సిక్కోలు వాసుల నీరాజనం- అడుగడుగునా అభిమానం (ETV Bharat)