AP Govt Focus on Fibernet Scam : విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తలుపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఫైబర్‌నెట్ దస్త్రాల స్కానింగ్ ప్రారంభమైంది. విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనేబుల్డ్ సంస్థ దస్త్రాల పరిశీలన బాధ్యతలు అప్పగించారు. దీంతో గత ఐదేళ్లలో ఏపీఎస్ఎఫ్ఎల్ (APSFL)లో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీస్తున్నారు.
విజయవాడలోని ఏపీ ఫైబర్‌నెట్ సంస్థ ప్రధాన కార్యాలయం తాళాలను పోలీసు బందోబస్తు నడుమ 62 రోజుల తర్వాత అధికారులు తీశారు. జగన్ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలకు ఈ సంస్థ కేంద్రంగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో గత ఐదేళ్లలో సంస్థలో జరిగిన వసూళ్లు ఎంత? వాటిని ఎలా ఖర్చు చేశారు? ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా? అనే కోణంలో ఆడిట్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దస్త్రాలను స్కానింగ్ చేయించే ప్రక్రియను ప్రభుత్వం బుధవారం ప్రారంభించింది.
ఏపీ ఫైబర్‌నెట్‌లో భారీ కుంభకోణం - రూ.151 కోట్లు గోల్మాల్ - AP FiberNet Scam Updates
విశాఖకు చెందిన ఐశ్వర్య ఐటీ ఎనేబుల్డ్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన సిబ్బంది ఫైబర్‌నెట్ కార్యాలయంలోనికి వెళ్లి దస్త్రాల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(APMDC) దస్త్రాలనూ ఈ సంస్థే స్కానింగ్ చేస్తోంది. కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు ఎన్ని అవసరం ఉంటుంది? ఎంత మంది సిబ్బందిని వినియోగించాలి? అనే అంశంపై ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. సంస్థకు చెందిన అన్ని దస్త్రాలను విభాగాల వారీగా స్కానింగ్ చేయనున్నారు.
సంస్థలో జరిగిన అక్రమాలు వెలుగులోకి రాకుండా కొందరు సిబ్బంది ఎన్నికల ఫలితాల తర్వాత దస్త్రాలను ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసేయాలని ఆదేశించింది. అప్పటి నుంచి కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ జరిపించాలని దీనికోసం తొలుత దస్త్రాలను స్కానింగ్ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.