Govt Appointed Special Public prosecutor in Phone Tapping Case :ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీనియర్ న్యాయవాది సాంబశివరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్కార్ జారీ చేసిన జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌పై సందిగ్ధత కొనసాగుతోంది.
Praneeth Rao Bail Petition Update : ప్రస్తుతం నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ప్రణీత్ రావుకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, సెక్షన్ 70 ఐటీ యాక్ట్ (IT Act) సహా మరో రెండు సెక్షన్లు ఉండటంతో బెయిల్ పిటిషన్‌ను సెషన్స్ కోర్టుకు బదిలీ చేసే అవకాశముంది. దీనిపై కూడా ఈ నెల 15న స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Hyderabad CP on PhoneTapping Case :మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ మొదటిసారిగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ పాతబస్తీ ఈద్గా వద్ద సీపీ మీడియాతో మాట్లాడారు. తొలిసారిగా ఆయన ఈ వ్యవహారంపై స్పందించారు. కేసు విచారణ వేగంగా జరుగుతోందని, దర్యాప్తు సక్రమ పద్ధతిలో సాగుతోందని చెప్పారు. రాజకీయ నేతలకు ఏమైనా నోటీసులు ఇవ్వనున్నారా అనే ప్రశ్నకు సమయం వచ్చినప్పడు అన్ని వివరాలు చెబుతానని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.