Govt Taken Special Measures to Fill Breach on Budameru Canal:బుడమేరు డైవర్షన్ కెనాల్లో పూడ్చిన గండ్ల వద్ద నీటి లీకేజీ లేకుండా ప్రభుత్వం గట్లను పటిష్ట పరుస్తోంది. మూడు గండ్లు పడిన చోట ముందుగా బండరాళ్లు, మట్టితో వరద నీటి ప్రవాహం దిగువకు వెళ్లకుండా అడ్డుకున్న జలవనరుల శాఖ ప్రస్తుతం ఆ ప్రాంతం నుంచి అస్సలు సీపేజీ లేకుండా చూసేందుకు జియో మెంబ్రేన్ షీట్లను వినియోగిస్తోంది. దానిపై 20 ఎంఎం రాళ్లను ఒక పొరగా వేసి దానిపై టార్పాలిన్ షీట్లను వేస్తున్నారు. వాటిపై ఇసుక బస్తాలను వేసి దిగువకు ఏమాత్రం సీపేజీ రాకుండా పనులు చేస్తున్నారు.
ఈ పనుల్ని జలనవరుల శాఖ మంత్రి నిమ్మల దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. గండ్లు పడిన ప్రాంతం నుంచి దిగువకు ఒక్క చుక్క నీరు కూడా రాకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పూడ్చిన గండ్లను మరింత పటిష్ట పరుస్తున్నట్టు జలవనరుల శాఖ చెబుతోంది. పూడ్చిన గండ్ల వద్ద కాలువ గట్టును ఎత్తు చేసే పని కూడా చేపట్టారు. మరోవైపు బుడమేరు డైవర్షన్ ఛానల్ ఎడమ వైపు గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతాలను కూడా మంత్రి స్వయంగా పరిశీలించి వాటిని పటిష్టం చేయాల్సిందిగా మంత్రి నిమ్మల ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు కుడి గట్టువైపు పడిన 8 గండ్లను కూడా పూడ్చివేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం బుడమేరు ప్రవాహలు ఎక్కువగా లేకపోవటంతో పనుల్ని ముమ్మరం చేశారు.
గండ్లు పూడ్చిన తరువాత బుడమేరు ఎలా ఉంది? - డ్రోన్ విజువల్స్ - Budameru Canal Breach Drone Visuals