Govt Employees Regular Transfers In Telangana : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు షెడ్యూలు విడుదలయింది. బదిలీలకు అవకాశం ఇవ్వాలని కొంత కాలంగా ఉద్యోగులను ప్రభుత్వాన్ని కోరుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీవో 80 విడుదల చేసింది. సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసింది. జులై 5 నుంచి 20 వరకు బదిలీలకు షెడ్యూలు ప్రకటించింది. బదిలీలకు విధివిధానాలు, మార్గదర్శకాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 నాటికి ఒకే చోట నాలుగేళ్లు పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్ణయించింది.
ఉద్యోగుల సాదారణ బదిలీలకు అనుమతి: రెండేళ్లు కూడా పూర్తి కాని ఉద్యోగులను బదిలీ చేయరాదని జీవోలో ఆర్థిక శాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది జూన్ 30లోగా ఉద్యోగ విరమణ చేసే వారు స్వచ్ఛందంగా కోరుకుంటే తప్ప బదిలీలు ఉండవు. ఒకే కేడర్లో 40 శాతానికి మించి ఉద్యోగును బదిలీ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీల్లో పలు కేటగిరీలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు మార్గదర్శకాల్లో ప్రభుత్వం వెల్లడించింది. స్పౌజ్, వితంతువు, ఏడాది లోపు రిటైర్ అయ్యే వారు, 70 శాతానికి మించి దివ్యాంగులు, మానసిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఉన్న వారు, క్యాన్సర్, న్యూరో సర్జరీ, కిడ్నీ, లివర్ ట్రాన్స్ ప్లాంట్, ఓపెన్ హర్ట్ సర్జరీ, ఎముకల టీబీ ఉన్న ఉద్యోగులు బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తారు.