Amaravati As Biodiversity City :ఏపీ రాజధాని అమరావతిని జీవ వైవిధ్య నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ రకాల మొక్కలు, పక్షులు, జీవ జాతులతో ఆకర్షణీయంగా మార్చేందుకు, ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసేందుకు ప్రముఖ పర్యావరణశాస్త్ర ప్రొఫెసర్, బయోడైవర్సిటీ నిపుణులు, దిల్లీ యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్ సీఆర్ బాబు (CR Babu) సూచనలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆయన 'మిషన్ క్లీన్ గంగా (Mission Clean Ganga)' ప్రాజెక్టుకు పని చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు పర్యావరణ సలహాదారుడిగా కూడా ఉన్నారు. సీఆర్ బాబు అమరావతిలో పర్యటించి సీడ్ యాక్సెస్ రహదారి, శాఖమూరు పార్కు, నీరుకొండ రిజర్వాయర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం వాటి వివరాలు నమోదు చేసుకున్నారు. మల్కాపురంలో ఉన్న రుద్రమదేవి కొలను, పక్కనే ఉన్న శివాలయం, ఏకశిలా శాసనాలను పరిశీలించారు. కొలను చుట్టూ వాకింగ్ ట్రాక్ (Walking Track) నిర్మించడంతో పాటు వివిధ రకాల పూల మొక్కలు నాటాలని సీఆర్డీఏ ఆలోచన చేస్తోంది.
అమరావతిలో చెట్ల పరిరక్షణకు డ్రోన్ల వినియోగం
Drones In Amaravathi :రాజధానిలో డ్రోన్లతో పచ్చదనం, పరిరక్షణ పెంచే ప్రక్రియను సీఆర్డీఏ అధికారులు ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అమరావతి లోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కనే ఉన్న చెట్లకు డ్రోన్ల ద్వారా సూక్ష్మ పోషకాలు అందించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ఆధునిక పద్ధతులను అవలంబిస్తోంది. సీడ్ యాక్సెస్ రహదారి వెంట ఉన్న బఫర్ జోన్ లో పది కిలోమీటర్ల పచ్చదనాన్ని సీఆర్డీఏ అధికారులు గతంలో అభివృద్ధి చేశారు.
డ్రోన్ల సాయం:అయితే గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వీటిని సంరక్షించే చర్యలు చేపట్టకపోవడంతో ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన అధికారులు డ్రోన్ల ద్వారా రక్షణ చర్యలను ఉద్యాన విభాగం చేపట్టింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర చెట్లపై డ్రోన్ సహాయంతో పోషకాలను పిచికారి చేయించారు. రాజధానిలో అందమైన పూల మొక్కలు, చెట్లపై సూక్ష్మ పోషకాలతో పిచికారి చేసి వాటిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో సీడ్ యాక్సెస్ రహదారి విభాగం పై ఉన్న మొక్కల సంరక్షణకు సైతం డ్రోన్లు వినియోగిస్తామని ఏడీసీ ఉద్యాన విభాగ అధికారి ధర్మజా తెలిపారు. డ్రోన్ ల వినియోగం వల్ల సమయం ఆదాతో పాటు వృథాను అరికట్టవచ్చన్నారు. ఒక్కో డ్రోన్ 25 నిమిషాలు నిర్విరామంగా గాలిలో ఎగురుతూ చెట్లకు పోషకాలు అందిస్తోంది. గంటకు సుమారు 36 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి చెట్లపై పిచికారీ చేస్తోంది.
హరిత రాజధానిగా అమరావతి:డ్రోన్ల ద్వారా పచ్చదనం పరిరక్షణ ప్రయోగం ఫలితాన్ని ఇచ్చింది. సీడ్ యాక్సెస్ రోడ్డు వెంట ఉన్న చెట్లపై సూక్ష్మ పోషకాలను పిచికారి చేశారు. దీంతో ఇకపై ఇదే విధంగా డ్రోన్ల సాయంతో సమర్థంగా పర్యవేక్షించాలని ఏడీసీ (అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్) నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ధను చూపుతోంది. వీటి పర్యవేక్షణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంట ఉన్న బఫర్ జోన్‌లో గతంలో టీడీపీ ప్రభుత్వం 10 కి.మీ మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేసింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ సర్కారు దీనిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో చెట్లు ఎండిపోయాయి. అమరావతి పునర్నిర్మాణ పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు ప్రారంభించింది.
విస్తృతంగా డ్రోన్లను వినియోగించాలన్న సీఎం:డ్రోన్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి రాజధానిలో పచ్చదనం పరిరక్షణకు ఉపయోగించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా దాదాపు కిలోమీటరు మేర చెట్లపై డ్రోన్ సాయంతో పోషకాలను పిచికారీ చేయించారు. దీని వల్ల చాలా సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. ఒక్కో డ్రోన్ సుమారు 25 నిమిషాలు నిర్విరామంగా గాలిలో ఎగురుతూ పోషకాలు పిచికారీ చేస్తోంది. గంటకు దాదాపు 36 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. త్వరలో అమరావతిలో నిర్మించనున్న ప్రధాన రహదారులపై అభివృద్ధి చేయనున్న పచ్చదనం సంరక్షణకూ డ్రోన్లను వినియోగించనున్నారు.
అప్పటికి ఏపీ ఎలా మారనుంది? - స్వర్ణాంధ్ర- 2047 విజన్ డాక్యుమెంట్