First Emergency Alert Issued as Godavari Water Level Rises in Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో సాయంత్రం 6.40 గంటలకు 43 అడుగులు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు సూచించారు. నీటిమట్టం పెరగడంతో గోదావరి నది స్నానఘట్టాల ప్రాంతంలో మెట్లు వరదనీటిలో మునిగిపోయాయి. వరద నీరు పెరగడంతో మత్స్యకారులు, ప్రజలు గోదావరి పరివాహక ప్రాంతాల వద్దకు వెళ్లవద్దని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
చర్ల మండలం వద్ద ఈత వాగు పైనుంచి వరదనీరు పారడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలం వద్ద సీత వాగు గుబ్బల మంగి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరదనీటిలో మునిగిపోయింది. భద్రాచలం నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు వెళ్లే ప్రధాన రహదారి చట్టి వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి దిగువన ఉన్న శబరి నదికి వరద నీరు భారీగా పోటెత్తడంతో భద్రాచలం నుంచి వరద నీరు దిగువకు నెమ్మదిగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద 8.85 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహం కొనసాగుతోంది. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. నీటమునిగిన రోడ్డు వద్ద రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డుపెట్టాలని అధికారులు ఆదేశించారు.
జలాశయాలకు పెరుగుతున్న వరద ఉద్ధృతి :కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరింది. బ్యారేజీ 85 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. ఎగువనుంచి వస్తున్న వరద నీటితో జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. భారీగా వరదనీరు చేరడంతో అధికారులు 17 గేట్లు తెరిచారు. జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 92 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 1.71 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.170 మీటర్లకు చేరకుంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.042 టీఎంసీలుగా ఉంది.