Girlfriend Acid Attack on Young Man In AP :బంధు మిత్రులతో కల్యాణ వేదిక కళకళలాడుతోంది. కాసేపట్లో వధూవరులిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఇంతలో అకస్మాత్తుగా శివంగిలా ఓ యువతి అక్కడకు దూసుకొచ్చింది. నాకు అన్యాయం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అంటూ తన వెంట తెచ్చుకున్న యాసిడ్, కత్తితో అతడిపై బీభత్సం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపం రణరంగంలా మారింది. అప్పటివరకూ పెళ్లి సందడిలో అందరూ ఉండగా అరుపులు, కేకలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. ఏం జరుగుతుందో అర్థం కాక పెళ్లికి వచ్చిన బంధువులంతా నిర్ఘాంతపోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగింది.
ఇదీ జరిగింది :రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా తనతో పదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తిరుపతికి చెందిన ఓ యువతి ఆరోపించింది. బాషా కొద్దిరోజులుగా కనిపించకుండా తిరుగుతుండటంతో అనుమానం వచ్చిన ఆ యువతి అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసింది. ఈ క్రమంలోనే ఆదివారం నందలూరులో బాషా వివాహం జరగనుందని తెలుసుకొని వెంటనే నేరుగా వివాహం జరిగే షాదీ ఖానా వద్దకు చేరుకుంది. తనను మోసం చేసిన విషయంపై వరుడిని నిలదీసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
వరుడిపై యాసిడ్ దాడికి పాల్పడిన యువతి :దీంతో ఆమె వెంట తెచ్చుకున్న యాసిడ్ ద్రావణం, కత్తితో బాషాపై దాడికి యత్నించింది సదరు యువతి. ఈ క్రమంలో అక్కడున్న యువకుడి బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తోపులాటలో వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్ పడి గాయాలయ్యాయి. ఈ ఘటనతో కోపోద్రిక్తుడైన బాషా కత్తితో ప్రియురాలు వీపు, భుజంపై బలంగా పొడవడంతో గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు మహిళల్ని స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి వైద్యసేవలందిస్తున్నారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు నిర్ధరించారు.