Gavi Matham Land Illegally Occupied :అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉన్న గవి మఠానికి ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి 3వేల ఎకరాల వరకు భూములు ఉన్నాయి. గతంలో ఈ మఠంలో కారుణ్య నియామకం ద్వారా గుమస్తాగా ఉద్యోగం పొందిన ఎం.మల్లికార్జున మఠం భూములనే కొట్టేశారు. అనంతపురం జిల్లా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా చేళ్లగుర్కి గ్రామ పరిధిలో సర్వే నంబరు 111 బిలో 3.35 ఎకరాలు, 114లో 19.05 ఎకరాలు కలిపి మొత్తం 22.40 ఎకరాలను మల్లికార్జున, అతని సోదరులు, సోదరి తదితర కుటుంబసభ్యుల పేరిట కర్ణాటక రెవెన్యూ రికార్డుల్లో పేరు ఎక్కించుకున్నారు. వాటి ఆధారంగా పట్టాదారు పాస్‌పుస్తకాలూ గతంలో పొందారు. ఈ భూములు అనంతపురం-ఉరవకొండ-బళ్లారి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నాయి. వీటి విలువ ఎకరానికి 50 లక్షల రూపాయలకే పైనే ఉంది. అంటే మల్లికార్జున కుటుంబసభ్యులు కొట్టేసిన మఠం భూముల విలువ 10 కోట్ల పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
గతంలో మఠం ఈఓగా పనిచేసిన ఓ అధికారి మఠానికి చెందిన భూముల వివరాలతో ఆస్తుల జాబితా తయారు చేశారు. అప్పటి వరకు మఠం భూములపై సరైన రికార్డులు లేవు. ఆస్తుల జాబితా తయారు చేయడంతో చేళ్లగుర్కి వద్ద 22.40 ఎకరాలు మఠానికి చెందిన భూమి ఉందని గుర్తించారు. అయితే దానికి మఠం ఉద్యోగి మల్లికార్జున, అతని కుటుంబీకులు పాస్‌పుస్తకాలు తయారుచేయించి, సొంతం చేసుకున్నట్లు తేలడంతో ఆయనను దేవదాయశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. తర్వాత ఆ భూములు వెనక్కి ఇచ్చేస్తానంటూ కేవలం తెల్లకాగితంపై రాసిచ్చి, తర్వాత మఠం పేరిట మ్యుటేషన్ చేయలేదు. ఇవేమీ పట్టించుకోని అధికారులు ఆ భూములను లీజుకు ఇచ్చేందుకు వీలుగా వేలం నిర్వహణకు కొంతకాలం కిందట సిద్ధమయ్యారు.
అయితే ఆ ఉద్యోగి సోదరుడు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. ఇప్పటికీ ఆ ఉద్యోగి మల్లికార్జున పేరిట ఉన్న భూమిని వెనక్కి ఇవ్వలేదు. ఈ భూములన్నీ కర్ణాటక ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తమకు దక్కినట్లేనంటూ వితండవాదం చేస్తున్నారని తెలిసింది. ఇంత జరిగినా దేవదాయశాఖ అధికారులు అతనిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేశారు. దీంతో అప్పటికే గుంతకల్లు సమీపంలోని కసాపురం ఆంజనేయస్వామి ఆలయంలో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందిన ఆయన, ప్రస్తుతం గ్రేడ్-1 ఈఓగా గుంతకల్లు గ్రూప్ ఆలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు.