GANJA CHOCOLATES SEIZED:గంజాయి విక్రయదారులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. తాజాగా గంజాయిని చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్నారు. పల్నాడు జిల్లాలో గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ సిబ్బంది పట్టుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా బడ్డీ కొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రంలోని పూరీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గంజాయిని తీసుకువచ్చి చాక్లెట్ల రూపంలో విక్రయిస్తున్న నేపథ్యంలో నరసరావుపేట ఎక్సైజ్ సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ మణికంఠ సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు.
ఆయుర్వేద మందుల రూపంలో విక్రయం: ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశా రాష్ట్రంలోని పూరీ మండలానికి చెందిన వ్యక్తి, నాలుగు నెలల క్రితం అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చాడని తెలిపారు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని ఈటి గ్రామంలో బడ్డీ కొట్టును ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని ఆయుర్వేద రూపంలో చాక్లెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నాడని తెలిపారు.
కార్మికులు, విద్యార్థులే లక్ష్యంగా: విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎక్సైజ్ అధికారులు ఆ వ్యక్తిని గుర్తించి పట్టుకున్నారన్నారు. 175 గ్రాముల గంజాయి, 400 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో పనిచేసే కార్మికులు, చదువుకుంటున్న విద్యార్థులే టార్గెట్గా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.