GANDIKOTA DEVELOPMENT: గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా పిలిచే గండికోట వారసత్వ సంపదకు మహర్దశ రానుంది. శత్రు దుర్భేద్యమైన కోటను కాపాడేందుకు పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. 78 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే ఇక్కడ సీప్లేన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు సుముఖత చూపడం, పర్యాటకంగా గండికోట అభివృద్ధి పథంలో నడుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
గండికోట ప్రాశస్త్యాన్ని వివరించిన పవన్: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది చారిత్రక వారసత్వ సంపద గండికోట. క్రీస్తుశకం 1123లో కాకరాజు ఈ కోటను నిర్మించినట్లు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నాటి రాజులు శత్రు దుర్భేద్యంగా ఈ కోటను చుట్టూ ఎత్తైన ప్రహరీతో నిర్మించుకున్నారు. ఈ వారసత్వ సంపదను కాపాడేందుకు పర్యాటకపరంగా మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి గండికోట ప్రాశస్త్యాన్ని వివరించి నిధులు మంజూరుకు విజ్ఞప్తి చేశారు.
ఏపీ పర్యాటకానికి కేంద్రం మెరుగులు - అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టు అభివృద్ధి
గండికోటకు 78 కోట్ల రూపాయలు మంజూరు: వెంటనే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం, గండికోటకు 78 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను "స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్" ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నిధులతో గండికోటను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర పర్యాటకశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. గండికోటలో నడకదారి, అభివృద్ధికి 30 కోట్ల 96 లక్షలు, బోటు షికారు కోసం కోటి 28 లక్షలు, పర్యాటకుల వసతికల్పన కోసం 12 కోట్ల 74 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు.
దీంతోపాటు గండికోటలో దర్శనీయ స్థలాలను మరింత అభివృద్ధి చేసేందుకు 15 కోట్ల 11 లక్షలు, రాత్రిపూట పర్యాటకులు ఉండేందుకు వీలుగా విద్యుత్ లైటింగ్ ఏర్పాటుకు 90 లక్షల రూపాయలు వెచ్చించనున్నారు. వారాంతంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు, విద్యార్థుల కోసం టెంట్లు, గుడారాలతో కూడిన మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. గండికోట తనకు ప్రత్యేక ప్రాజెక్టు అని, తమ పూర్వీకుల ప్రదేశంగా గండికోటకు పేరు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రాండ్ కాన్యన్ ఆఫ్ ఇండియాగా గండికోటను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.