Free Swimming Training at Yanam GMC Indoor Stadium:వ్యాయామాల్లో అత్యుత్తమమైనది ఈత. వేసవి సెలవుల్లో సేదతీరడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకునే వెసులుబాటు ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారులతో కలిసి ఈతకొలను బాట పడుతున్నారు. పుదుచ్చేరిలోని యానాం జీఎంసీ బాలయోగి స్టేడియంలోని ఈత కొలను అందుకు నెలవుగా మారింది. సాయ్ ఆధ్వర్యంలో వర్ధమాన ఆటగాళ్లు జాతీయస్థాయి ఈత పోటీల్లో పాల్గొనడానికి ఇక్కడ శిక్షణ పొందుతున్నారు.
బత్తాయి వ్యాపారుల బడా మోసం- ధర ఉన్నా నాణ్యత సాకుతో కోతలు - Mosambi Farmers Low Price
యానాం ఓల్డేజి హోం సహకారంతో ఔత్సాహికులకు ఏటా ఉచితంగా ఈతలో శిక్షణ ఇస్తున్నారు. యానాంతోపాటు చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల నుంచి వందలాది మంది బాలబాలికలు వచ్చి ఈత నేర్చుకుంటున్నారు. రిలయన్స్ సంస్థ పారిశ్రామిక సామాజిక బాధ్యత నిధులతో 50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో ఈత కొలను నిర్మించింది. ఈ ఈత కొలనును నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం రోశయ్య నవంబర్, 2011లో ప్రారంభించారు.
యానాం పరిసరాలలో గోదావరి నదితోపాటు, కాల్వలు ఉండటం, గతంలో అనేక మంది స్నానాలకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో రిలయన్స్ సీఎస్ ఆర్ నిధులతో ఈత కొలనును నిర్మించారు. అత్యాధునికమైన ఈత కొలను అందుబాటులో ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు దగ్గరుండి ఈత నేర్పిస్తున్నారు. వేసవి సెలవులకు ఇతర ప్రాంతాల నుంచి యానాం వచ్చే వారు ఈ కొలనును సద్వినియోగం చేసుకుంటున్నారు.