Amaravati Drone Summit 2024 :ఇక నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకు 45 నిమిషాల్లో రావచ్చు. అంత త్వరగా రావాలంటే అయితే హెలికాప్టర్ లేదా విమానంలో రావాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేది ఈ రెండింటి గురించి కాదు. మరి ఈ రెండూ కాకుండా ఈ అంత తక్కువ సమయంలో ఇంత దూరం ఎలా ప్రయాణించగలం అని ఆలోచిస్తున్నారా? ఇంకెలాగా డ్రోన్‌లో! అదెలాగంటారా? ఈ హైదరాబాద్ టు విజయవాడ డ్రోన్ ప్రయాణం గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
డ్రోన్ల ప్రత్యేకతలు, పని తీరు : వ్యవసాయం, వైద్యం, రక్షణ వంటి పలు రంగాల్లో డ్రోన్ల సేవలు ఇప్పటికే అందుతుండగా సమీప భవిష్యత్తులో వాటి వినియోగం మరికొన్ని రంగాలకూ విస్తరించనుంది. మానవ కొరత ఉన్న రంగాల్లో డ్రోన్లు ఎలాంటి సేవలు అందిస్తాయో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు ఎంతమేర ఉంటాయి? ఇన్నాళ్లూ వివిధ రంగాల్లో ఉన్న అడ్డంకులను ఇవి ఎలా అధిగమిస్తాయి? సహాయచర్యలకు ఎలా ఉపయుక్తంగా ఉంటాయి? ఇలాంటి అనేక విషయాలు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో మంగళవారం నిర్వహించిన డ్రోన్ సమిట్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.
దేశంలోని నలుమూలల నుంచి డ్రోన్ తయారీదారులు ఈ సమిట్‌కు వచ్చారు. వారు తాము రూపొందించిన, దిగుమతి చేసుకున్న, అభివృద్ధి చేసిన డ్రోన్లను ప్రదర్శించారు. వీటిలో కొన్ని ప్రయోగాత్మక దశలో, మరికొన్ని పరీక్ష స్థాయిలో ఉన్నాయి. మిగిలిన చాలావరకు డ్రోన్లు ఇప్పటికే ఉపయోగంలో ఉన్నాయి. ఆయా డ్రోన్ల ప్రత్యేకతలు, వాటి పనితీరును తిలకిస్తూ వంటి వివరాలను తెలుసుకున్నారు.
మానవ రహిత హెలికాప్టర్ : దీనిపేరుహైడ్రోజన్ ఎలక్ట్రిక్ పవర్డ్ వీటీఓఎల్ ఎయిర్‌క్రాఫ్ట్. హెలికాప్టర్‌లా కనిపించే ఈ డ్రోన్‌ను ప్రస్తుతం సరకు రవాణాలకు ఉపయోగిస్తున్నారు. 100 కిలోల బరువు గల సరకును 300 కిలోమీటర్ల వరకు తీసుకెళ్తుంది. దీనికి పైలట్, రన్‌వే అవసరం లేదు. ఉన్నచోటు నుంచే నేరుగా పైకి వెళ్తుంది. గమ్యస్థానాన్ని నిర్ణయిస్తే నేరుగా అక్కడికి సరకును చేరవేస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ 45 నిమిషాల్లో, ముంబయి నుంచి పుణెకి 30 నిమిషాల్లోపే చేరవేస్తుంది. ప్రస్తుతం మనుషులు ప్రయాణించే ఎయిర్ టాక్సీలకు అనుమతులు లేని కారణంగా వీటిలో రవాణా చేస్తున్నారు. 2025 నాటికి మానవరహిత డ్రోన్లలో టన్ను పేలోడ్‌తో 800 కి.మీ.ల సామర్థ్యంతో ఉండేవాటిని అందుబాటులోకి తెస్తామని చెబుతున్నారు తయారీదారులు.
మందులు, ఆసుపత్రుల అవసరాల కోసం: ఈ డ్రోన్‌ను రెడ్‌వింగ్ అనే కంపెనీ పేరుతోనే ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని మందులు, ఇతర ఆసుపత్రుల అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు. మందులు, రక్త నమూనాలు, టీకాలను తీసుకువెళ్లేందుకు వినియోగిస్తున్నారు. 3కేజీల బరువును, 50కి.మీ. మేర తీసుకెళ్తుంది. మందులను భద్రపరిచేందుకు కోల్డ్‌స్టోరేజీ కూడా ఏర్పాటుచేశారు. ‘యాలి ఏరోస్పేస్’ అనే సంస్థ వీటిని ప్రమోట్ చేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలక మందులను అత్యవసరంగా ఈ డ్రోన్‌లతో సరఫరా చేస్తున్నారు. ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు, స్మార్ట్ మెడిసిన్ బాక్స్, క్లౌడ్ వీడియోలను పర్యవేక్షించడం వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. మొబైల్ యాప్ ఆధారంగా ఈ డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు.