Peddi Reddy Encroachment the Lands of Buggamatham in Tirupati: విలువైన స్థలం కంటపడితే చాలు అది అడవా, చెరువా, ప్రభుత్వ భూమా, లేదా మఠం భూమా అన్న పట్టింపు లేదు. ఆక్రమించడమే ఆయన నైజం. గత వైఎస్సార్సీపీ హయాంలో అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో నంబర్ టూగా అధికారాన్ని చలాయించి ప్రకృతి వనరులను దోచుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూకబ్జా బాగోతం ఇది. వంద కోట్ల రూపాయలకు పైగా విలువైన 3 ఎకరాల బుగ్గమఠం భూములను ఆక్రమించడమే కాకుండా చుట్టూ ప్రహరీ కట్టేశారు. ఆ స్థలంలో వైఎస్సార్సీపీ కార్యాలయం, గోశాల నిర్మించారు.
బుగ్గమఠం భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి:వైఎస్సార్సీపీ హయాంలో ప్రకృతి వనరుల్ని భూబకాసురుడిలా భోంచేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గంలోని మంగళంపేట రిజర్వు ఫారెస్ట్ భూములను కబ్జా చేసి అక్కడో విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నారు. అంతేకాక అక్కడో విశాలమైన వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుని అందులో గోశాల నిర్వహిస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి అనుచర గణమైతే అతనిని మించిపోయారు. ఆయన ఆక్రమించిన 3 ఎకరాలకు పక్కనే మరో మూడున్నర ఎకరాలు ఆయన ఆక్రమణలో ఉన్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తేల్చడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
4.20 ఎకరాల్లో విలాస భవనం: తిరుపతి నడిబొడ్డున మారుతినగర్, రాయల్‌నగర్‌లో ఉన్న బుగ్గమఠం భూముల్లోని 4.20 ఎకరాల్లో పెద్దిరెడ్డి విలాసవంతమైన నివాసభవనాన్ని నిర్మించుకున్నారు. ఆ భూములను తాను కొన్నానని చెబుతున్న పెద్దిరెడ్డి ఇంటికి ఎదురుగా ఉన్న 3 ఎకరాల బుగ్గమఠం భూములను ఆక్రమించారు. వైఎస్సార్సీపీ హయాంలో తన ఇంటికి వెళ్లే మార్గానికి తిరుపతి నగరపాలక సంస్థ నిధుల్లో 19 లక్షలు వెచ్చించి మరీ ఆగమేఘాలపై రోడ్డు వేయించుకున్నారు. ఇంకెవరూ ఆ మార్గంలో వెళ్లేందుకు వీల్లేకుండా రెండువైపులా గేట్లు పెట్టేశారు. స్థానిక ప్రజల కోసమని రోడ్డు వేసి వారికే రాకపోకలు లేకుండా చేయడమేంటని అప్పట్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ ఆ గేట్లు అలానే ఉండటం గమనార్హం. ఆ మార్గంలోకి తమను అనుమతిస్తున్నా అప్పడప్పుడూ గేట్లు మూసేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
బుగ్గమఠం చరిత్ర: రామానంద సంప్రదాయాన్ని పాటించే ఉత్తరాది బైరాగులు తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయ దక్షిణ మాఢవీధిలో బుగ్గమఠం ఏర్పాటు ఏర్పాటు చేశారు. మఠం ఆవరణలో కోదండరామస్వామి ఆలయ నిర్వహణతోపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సాధువులకు భోజనం, బస వంటి సదుపాయాల కల్పన ద్వారా హిందూమత పరిరక్షణ లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. బుగ్గమఠానికి చంద్రగిరి రాజులు భూములు, ఆస్తుల్ని దానంగా ఇచ్చారు. 1970లో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం వహించేలా బుగ్గమఠాన్ని దేవదాయశాఖ పరిధిలోకి తెచ్చారు.
దేవదాయశాఖ కార్యాలయ రిజిస్టార్లు, రెవెన్యూ రికార్డులు, అడంగల్ మేరకు బుగ్గమఠానికి 123.43 ఎకరాల భూమి ఉండేది. 1983, 1986 సంవత్సరాల్లో 76.65 ఎకరాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. 1990, 1991లో ప్రైవేటు చర్చల ద్వారా ధర నిర్ణయించి 24.29 ఎకరాలను విక్రయించగా మరో 22.49 ఎకరాలు మఠం ఆధీనంలో ఉండాలి. కానీ 14.19 ఎకరాలు లీజుదారులుగా చలామణి అవుతున్న ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. మరి కొంత భూమిని ఆక్రమణదారులు చెరపట్టి నిర్మాణాలు చేపట్టగా కేవలం 38 సెంట్ల స్థలం మాత్రమే మఠం ఆధీనంలో ఉంది.