Vallabhaneni Vamsi Anarchy: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకాలకు అడ్డే లేదు. బెదిరింపులు, సెటిల్‌మెంట్‌లు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు, దౌర్జన్యాలకు ఆయన పెట్టింది పేరు. తెలుగుదేశం నుంచి గెలిచి వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత జగన్ అండ చూసుకుని మరింత రెచ్చిపోయారు. ప్రకృతి వనరులను కొల్లగొట్టారు. ఆఖరుకు అన్నంపెట్టిన చేతినే కరిచినట్లు రాజకీయ ఎదుగుదలకు కారణమైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనే దాడి చేయించారు. ఆ కేసులోనే ఇప్పుడు అరెస్ట్ అయి కటకటాలపాలయ్యారు.
అయినవాళ్లు సైతం అసహ్యించుకుంటారు: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు చెబితే చాలు అరాచకాలు, దౌర్జన్యాలే గుర్తుకొస్తాయి. ఆయన నోటిదురుసుతనం, జుగుప్సాకర భాషను అయినవాళ్లు సైతం అసహ్యించుకుంటారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కొన్నిరోజులకే వైఎస్సార్సీపీలో చేరారు. అధికారం అండతో మరింత రెచ్చిపోయిన వంశీ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. అత్యంత హేయమైన భాషతో చంద్రబాబును తిట్టడంతోపాటు, ఆయన సతీమణి భువనేశ్వరి వ్యక్తిత్వ హననం చేసేలా జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపైనా దాడి చేయించారు. ఇప్పుడు అదే కేసులో అరెస్టై కటకటాల పాలయ్యారు.
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్ - విజయవాడ జిల్లా జైలుకు తరలింపు
వైఎస్సార్సీపీలో చేరలేదని అక్రమ కేసులు పెట్టించి: పాము తన పిల్లలను తానే తిన్నట్లు, వంశీ తన విజయం కోసం కష్టపడి పనిచేసిన తెలుగుదేశం నాయకులు, శ్రేణులపైనే కక్షసాధింపు చర్యలకు దిగారు. తనతోపాటు వైఎస్సార్సీపీలో చేరలేదని అక్రమ కేసులు పెట్టించి వేధించారు. వారి ఆస్తులపైనా దాడులు చేయించి, ఆర్థిక మూలాలు దెబ్బతీశారు. గన్నవరం టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావుకు వారసత్వంగా వచ్చిన డీ పట్టా భూమి స్వాధీనం చేసుకుని అందులో ఉన్న నిర్మాణాలు కూల్చివేయించారు.