Operation Leopard in Rajamahendravaram : గత కొద్దిరోజులుగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరుతను బంధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఇంఛార్జ్ డీఎఫ్ఓ భరణి తెలిపారు. దానిని పట్టుకునేందుకు 50 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కానీ అది మాత్రం ఎక్కడా చిక్కడం లేదని భరణి పేర్కొన్నారు.
ఇప్పటి వరకూ చిరుత 4 సార్లు మాత్రమే కెమెరాలకు చిక్కిందని భరణి వివరించారు. దాని కదలికలను బట్టి ట్రాప్ కెమెరాలను, బోన్లను వేర్వేరు ప్రదేశాలకు మారుస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సాధారణ డ్రోన్ సహాయంతో చిరుత సంచారాన్ని గాలించినప్పటికీ జాడ కనబడలేదన్నారు. అందుకే థర్మల్ డ్రోన్ సాయంతో గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇటువంటి డ్రోన్లు రాత్రిపూట సైతం సమర్థవంతంగా పని చేస్తాయని భరణి వెల్లడించారు.
'ఈ క్రమంలోనే జాతీయ రహదారిపై ఆటోనగర్ నుంచి లాలా చెరువు హౌసింగ్ బోర్డు వరకు వాహనదారులు చిరుత కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రోడ్డుకి ఇరువైపులా గమనిస్తూ నెమ్మదిగా వెళ్లాలి. జాతీయ రహదారిపై స్పీన్లిమిట్ బోర్డులు సైతం ఏర్పాటు చేశాం. చిరుతలు సాధారణంగా జనావాసాల్లోకి రావడం తక్కువ. మనుషుల కంటపడేందుకు ఇష్టపడవు. అలికిడి వినిపిస్తే దూరంగా వెళ్లిపోతాయి' అని భరణి వివరించారు.