Tracking Cameras for Tiger in Kakinada District :పులి జాడ తెలియడానికి వాటి అడుగులే ఆధారం. ట్రాపింగ్ కెమెరాల్లో చిక్కితేనే దాని ఉనికి తెలిసేది. కాకినాడ జిల్లా జిల్లా ప్రత్తిపాడు ఉప ప్రణాళికా మన్యానికి వచ్చిన పులి కోసం అన్వేషణ అటవీశాఖకు పెనుసవాలుగా మారింది. మరో పక్క సబ్‌ప్లాన్ పల్లెలో స్వేచ్ఛగా సంచరించలేని పరిస్థితి. బాపన్నధారలో ఆవుదూడను చంపి వెళ్లి ఉనికి చాటిందే తప్ప 3 రోజులుగా జాడ లేదు. పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల్లోనూ కనిపించలేదు. పాదముద్రల కోసం అన్వేషిస్తున్నా దొరకడం లేదు. డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో ఏలేశ్వరం అటవీ క్షేత్రాధికారి దుర్గారామ్ ప్రసాద్, డీఆర్‌వో జాన్సన్, క్షేత్ర సిబ్బంది పులి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
హెచ్చరికలు ఏర్పాటు :కిత్తమూరిపేట ఎగువన ఉన్న ధారపల్లి జలపాతానికి సందర్శకుల తాకిడి ఉంటుంది. ఇక్కడ గిరులు, తరులు మధ్య జలహోరును ఆస్వాదించేందుకు జిల్లా నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. పెద్దిపాలం నుంచి కిత్తమూరిపేట మీదుగా బసమామిడికి చేరుకుని బురదకోట, ధారపల్లి వెళ్లాలి. ధారపల్లి వెళ్లే దారిని మూసివేశారు. హెచ్చరికలు ఏర్పాటు చేశారు.
టైగర్ జర్నీ- ఛత్తీస్‌గఢ్ కీకారణ్యం నుంచి ఓరుగల్లుకు
వాతంగి వైపు వెళ్లి ఉండచ్చు : పులి ఎటు మళ్లింది అనే విషయమై యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. గతంలో పోతులూరు, పొదురుపాకల్లో మాదిరి మన్యంలో ఉంటే ఆహార వేటలో సడి తెలిసేది. ఈసారి ఉనికిని చాటాక జాడ తెలియకపోవడంతో దాని పయనంలో కిత్తమూరిపేట ఫారెస్టు బీట్ నుంచి వాతంగి వైపు వెళ్లి ఉండచ్చని అధికారులు భావిస్తున్నారు.
ప్రజలందరి గుండెల్లో గుబులు :ప్రత్తిపాడు మండలం ఉపప్రణాళిక మన్యంలోకి పులి వచ్చిందనే వార్త ప్రజలందరి గుండెల్లో గుబులు పుట్టించింది. బాపన్నధార పరిసర ప్రాంతంల్లో ఓ క్రూరమృగం చేతిలో పశువు బలైనట్లు అక్కడి స్థానికులు అందించిన సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ధారపల్లి, బాపన్నధార, బురదకోట పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ఆదివారం గాలింపు చర్యలు చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. పులి వచ్చిందనే సమాచారంతో ప్రత్తిపాడు పోలీసులు ఉపప్రణాళిక మన్యానికి వెళ్లారు. పులి రాక గురించి కిత్తమూరిపేట, పెద్దిపాలెం, బురదకోట పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా చర్చ జరిగింది.
పులి మళ్లీ వచ్చింది! - తూర్పు గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న బెబ్బులి