Floods in Vizianagaram District :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో విజయనగరం జిల్లా అంతటా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండురోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. విజయనగరం నగర పాలక సంస్థ పరిధిలోని అయ్యన్నపేట కోమటి చెరువు నిండిపోవడం తో రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దుప్పాడ - అయ్యన్నపేట ప్రధాన కూడలిలో వరద ప్రవాహం క్రమ క్రమంగా పెరగడంతో ఆ ప్రాంతమంతా వరద నీటితో నిండిపోయింది.
దీంతో దుప్పాడ, అయ్యన్నపేట, జొన్నవలస, పినవేమలి, పెదవెమలి, తదితర గ్రామాలకు వెళ్ళే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాలు లోతు ఎత్తు నుంచి వరద ప్రవాహం కొనసాగడంతో వాహనదారులు ఆపసోపాలు పడ్డారు. ముఖ్యంగా ద్వి చక్ర వాహన చోదకులు వాహనం నడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రానికి మరో వాయు"గండం" - ఉరకలేస్తున్న కృష్ణా, గోదావరి- ఉప్పొంగుతున్న వాగులు - RAINS Alert
నష్ట పరిహారం చెల్లించాలని కోరుతున్న రైతులు :జిల్లాలోని వంగర మండలం మడ్డువలస జలాశయంలోకి వరద పోటెత్తింది. ప్రాజెక్టు 6 ప్రధాన గేట్లు ఎత్తి సుమారు 16 వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి అధికారులు వదిలారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వేగావతి స్వర్ణముఖి నదులు నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. సాయన్నగడ్డ పొంగిపోర్లడంతో రేగడి మండలోని ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వాసుపత్రి ఆవరణలోకి వరద నీరు భారీగా చేరింది.
వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరి చెరుకు పొలాలు నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంతకవిటి మండలంలోని రామారావుపురం, మల్లయ్యపేట, మంతెన, చిన్నయ్యపేట, చింతలపేట, భూరాడపేట తదితర గ్రామాల్లో వరి పొలాలు నీటలో మునిగిపోయాయి. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
వరదలతో రూ. 6,880 కోట్లు నష్టం - ప్రాథమిక నివేదిక సిద్ధం - Report on AP Floods Loss
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశాలు : పార్వతీపురం మన్యం జిల్లాలో 16.8 మిల్లీమీటర్ సగటు వర్షం కురవగా, వీతంపేట, కురుపాం మండలాల్లో అత్యధికంగా 2 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాపై వర్ష ప్రభావం, అధికార యంత్రాంగం ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చర్చించారు. నదులు, రిజర్వాయర్లులో నీటి మట్టంపై ఆరా తీశారు. తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో నీటి పరివాహ ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ కాలువవైపు వెళ్లకుండా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. అధికారం యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. నీటి పారుదలశాఖ ఈఈని కలెక్టరేట్లోనే ఉంచి, ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తూ తగు చర్యలను తీసుకోవాలని మంత్రి సూచించారు.
ఆంధ్ర ఒరిస్సా రాకపోకలకు అంతరాయం :వరుసగా కురుస్తున్న వర్షాలతో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం వేగావతి నదిపై నిర్మించిన కాజువే కొట్టుకుపోయింది. గతంలో ఓసారి పాక్షికంగా కొట్టుకుపోగా ప్రస్తుతం పూర్తిగా కొట్టుకుపోయాయి. రెండోసారి మరమ్మతులు చేపట్టారు. మళ్లీ కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలకు కీలక రహదారి ఇదే. వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసింది. తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ అవస్థలు ఏర్పడ్డాయి. దీనికిప్రత్యమ్నయంగా కాజువే నిర్మించారు. అది కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా బొబ్బిలి మండలంలోని ఛానల్‌కు గండి ఏర్పడింది. దీని వలన అరటి తోటల , వరి పేర్లు ముగిపోవడంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు.
నీటిపారుదల శాఖ అధికారులు ముందుస్తు చర్యలు :విజయనగరంజిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు, జలాశయాలకు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో పలు జలాశయాలు తొణికిస లాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం మరో రెండు రోజుల పాటు కొనసాగనుందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు ముందుస్తు చర్యలు చేపట్టారు.
దీంతో ముందస్తు జాగ్రత్తగా ఎనిమిది గేట్లు తెరచి 17,000 క్యూసెక్కులు నీటిని నాగావళి నదిలోకి విడిచి పెడుతున్నట్లు మడ్డువలస జలాశయం డీఈఈ అర్జున్ తెలిపారు. అదే విధంగా తాటిపూడి జలాశయం నుంచి 350 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిపెట్టారు. తాటిపూడి జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 297అడుగులు కాగా., ప్రస్తుతం 295.50 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు వరదనీరు పోటెత్తుండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ప్రాజెక్టు అధికారులు 350క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు.
అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కాజ్ వేలు, వంతెనలు, కల్వర్టులు, రోడ్లపై నుంచి నీటి ప్రవాహం జరిగే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితుల్లో ప్రజలు వాటిపై రాకపోకలు చేయకుండా నియంత్రించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. యువకులు ప్రవాహం సమీపం వరకు వెళ్లి సెల్ఫీల కోసం ప్రయత్నించకుండా నిరోధించాలని చెప్పారు. చంపావతి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా గ్రామస్థులు సహకరించాలని కోరారు. మడ్డువలస ప్రాజెక్టు వద్ద పరిస్థితిపై ఆర్‌డీఓ బి.శాంతితో చర్చించారు. కలెక్టర్ తాటిపూడి రిజర్వాయరును సందర్శించి నీటినిల్వలను పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులతో ప్రాజెక్టు ఇన్ ఫ్లోలపై చర్చించారు. నీటిని విడుదల చేసినపుడు దిగువ ప్రాంతాల్లో ప్రజానీకాన్ని ముందుగా అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
అనంతరం విజయనగరంలోని పెద్ద చెరువు ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి చెరువులో వరద నీటి ప్రవాహ పరిస్థితిపై ఆరా తీశారు. వదంతులను నమ్మవద్దని చెరువుకు ఎలాంటి గండి పడలేదని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియచేశారు. జిల్లాలో సోమవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినందున ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా వినతులు స్వీకరణ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం - పలు జిల్లాల్లో భారీ వర్షాలు - IMD Issues Rainfall Alert