Vijayawada Recovering to Floods : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలు వేగంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. వరదానంతర చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మురుగుకాలువల్లో పెద్ద ఎత్తున చేరిన పూడికను యుద్ధ ప్రాతిపదికన జేసీబీల సాయంతో తొలగిస్తోంది. నగరపాలక సంస్థ విడుదల చేస్తున్న నీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని చెత్త, మురుగుని శుభ్రం చేసి పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్ చల్లుతున్నారు. సింగ్‌నగర్‌లో ఇప్పటికే పూర్తిస్థాయిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాయకాపురంలోనూ క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అంబాపురంలోనూ వరద తగ్గింది. ప్రభుత్వం, అధికారులు ప్రత్యేక దృష్టిసారించడంతో వరద ప్రభావం నుంచి నగరం వేగంగా సాధారణ పరిస్థితికి చేరుకుంటోంది.
కీలకపాత్ర పోషించిన అగ్నిమాపక శాఖ : వరద తెచ్చిన బురద నుంచి బెజవాడ వాసులకు ఉమశమనం కల్పించడంలో కీలకపాత్ర పోషించిన అగ్నిమాపక శాఖ సిబ్బంది, అధికారుల్ని ఆ శాఖ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ ప్రజల మధ్యనే భుజం తట్టి అభినందించారు. స్వయంగా సంతకాలు చేసిన ప్రశంసాపత్రాలతోపాటు రికార్డు అందించి ప్రోత్సహించారు. మేమున్నామంటూ భరోసా కల్పించిన అగ్నిమాపక సిబ్బందిని ప్రజలు బహిరంగంగా అభినందించడం తమకు లభించిన గొప్ప అవార్డుగా అభివర్ణించారు.
"వరదలతో అతలాకుతమైన విజయవాడని సాధారణ స్థితికి తీసుకురావడంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది కీలకపాత్ర పోషించారు. ఇది ఈ శాఖ పరిధిలోకి రానప్పటికి ప్రజల కష్టాలకు చలించి ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ముందుకు వచ్చాం. బాధితులు కృతజ్ఞతలు తెలుపుతుంటే ఎంతో సంతోషంగా ఉంది." - మాదిరెడ్డి ప్రతాప్, అగ్నిమాపకశాఖ డీజీ