Pakala Beach Tragedy : సంక్రాంతి పండగను వారంతా సంతోషంగా జరుపుకొన్నారు. ఈ క్రమంలో సముద్రం స్నానం చేద్దామని 25 మంది బీచ్‌కి వెళ్లారు. నీటిలోకి దిగి అందరూ సరదాగా ఆడిపాడారు. కానీ ఆ అలలే తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తాయని వారు ఊహించి ఉండరు. స్నానానికి దిగి వారిలో ఆరుగురు అలల తాకిడికి సముద్రంలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరిని రక్షించారు. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పొన్నలూరు మండలం తిమ్మపాలెం, శివన్నపాలెం గ్రామాలకు చెందిన 25 మంది సింగరాయకొండ పాకల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో అలల తాకిడికి ఆరుగురు సముద్రంలో కొట్టుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు స్థానిక జాలర్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని రక్షించగా, నలుగురి మృతదేహాలను వెలికి తీశారు.
మృతులు సింగరాయకొండకు చెందిన తన్నీరు పవన్, పొన్నలూరు మండలం శివన్నపాలెంకు చెందిన నోసిన జెస్సిక (15), నోసిన మాధవ (25), కందుకూరు మండలం కొల్లగుంట గ్రామానికి చెందిన యామిని (16)గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరిని రక్షించినట్లు చెప్పారు. మృతదేహాలను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Minister Dola on Pakala Beach Incident :బీచ్‌లో నలుగురు మృతి చెందడంపై మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలకు వెంటనే పోస్టుమార్టం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరితో మంత్రి ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీచ్‌ల వద్ద ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని డోలా బాల వీరాంజనేయస్వామి సూచించారు.
అల్లూరి జిల్లాలో విషాదం - జలపాతంలో ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులు గల్లంతు - MBBS STUDENTS MISSING