Fishermen Problems in AP :శ్రీకాకుళం జిల్లాకు సువిశాల సముద్రం తీరం ఉన్నా చేపల వేటకు సరైన సౌకర్యాలు లేక మత్స్యకారులు ఇబ్బందిపడుతున్నారు. పొట్టకూటి కోసం నడి సంద్రంలోకి వెళ్తూ రాకాసి అలల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నారు. జెట్టీలు నిర్మిస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఐదేళ్లైనా నెరవేరక వలసబాట పడుతున్నారు.
మత్స్యకారుల వలసలు :రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాకు 193 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉంది. 11 మండలాల్లోని 104 గ్రామాలకు చెందిన 1,12,000ల మంది మత్స్యకారులకు చేపల వేటే ఆధారం. స్థానిక వేట గిట్టుబాటు కాక ఏటా వేల మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇళ్లు విడిచి పోలేనివారు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అరకొర వేటతో, చాలీచాలని ఆదాయంతో బతుకీడుస్తున్నారు. డీజిల్, వేట సామగ్రి ధరల పెరుగుదల వారికి శరాఘాతంగా మారింది.
రాష్ట్రంలో దంచికొడుతున్న వానలు - ఉప్పొంగుతున్న వాగులు, వంకలు - Heavy Rains in AP 2024
జెట్టీల నిర్మాణంలో నిర్లక్ష్యం :మత్స్యకారులను ఆదుకునేందుకు 3 మినీ జెట్టీలను నిర్మిస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. బుడగట్లపాలెంలో 37 ఎకరాల్లో రూ.332 కోట్ల అంచనా వ్యయంతో హార్బర్ నిర్మిస్తామని అప్పటి సీఎం జగన్ ప్రకటించారు. వజ్రపు కొత్తూరు మండలం నువ్వుల రేవు , మంచినీళ్ల పేట మధ్య 13 ఎకరాల్లో టీ-జెట్టి నిర్మిస్తామని చెప్పారు. రూ.12 కోట్లతో అనుమతులు సైతం మంజూరు చేశారు. కానీ గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సముద్రంలో వేటకు వెళ్తున్న మత్స్యకారులు ఒక్కోసారి రాకాసి అలల దాటికి పడవలు బోల్తా పడి మృత్యువాత పడుతున్నారు. దీనికి కారణం జెట్టీలు లేకపోవడమేనని వారు వాపోతున్నారు.
"సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి చాలా మంది చనిపోయారు. ఇక్కడ సరైన సదుపాయలు లేకపోవడంతో గుజరాత్ తీర ప్రాంతానికి కొంత మంది మత్స్యకారులు వలసలు వెళ్లాం. అక్కడ సరిహద్దు ప్రాంతాన్ని దాటినందుకు పాకిస్థాన్ వాళ్లు మమల్ని అరెస్ట్ చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇక్కడే జెట్టిలను నిర్మిస్తే ఎలాంటి సమస్య ఉండదు . గత ప్రభుత్వం నిర్మిస్తామని హామీ ఇచ్చి నిర్మించలేదు. కనీసం కూటమి ప్రభుత్వం అయిన నిర్మిస్తుందని ఆశిస్తున్నాం" - మత్స్యకారులు
బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం - రాష్ట్రంలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు - AP Weather Report
కూటమి ప్రభుత్వపైనే ఆశలు :ఉపాధి లేక జిల్లా నుంచి ఏటా వేల మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాల్లోని సముద్ర తీరానికి వలసపోతున్నారు. 2018లో గుజరాత్ రేవు నుంచి వేటకు వెళ్లగా పాక్ నేవీ పట్టుకుని జైల్లో పెట్టింది. దాదాపు 14 నెలలు చెరసాల్లో మగ్గిన మత్స్యకారులు చివరికి కేంద్రం చొరవతో స్వస్థలాలకు చేరారు. ఇళ్లకు వచ్చిన మత్స్యకారులు మళ్లీ వేటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మన రాష్ట్రంలో జెట్టీలు నిర్మిస్తే వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. జెట్టీల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తే స్థానికంగా ఉపాధి దొరుకుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.
వ్యర్థాల పైప్లైన్ తొలగించాలని మత్స్యకారుల ఆందోళన - బోటుకు నిప్పు - పలువురు ఆత్మహత్యాయత్నం