Fire Accident at Sitara Center in Vijayawada : విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యాధరపురంలోని కశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ లో జరిగిన అగ్ని ప్రమాదం లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలేంటన్నది స్పష్టంగా తెలియడం లేదు. విజయవాడ వెస్ట్ జోన్ ACP దుర్గారావు, అగ్నిమాపక శాఖ అధికారి శంకరరావు ఘటనాస్థలిని పరిశీలించారు. సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఎగ్జిబిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన దుకాణాలు కాలి దగ్గమయ్యాయి. ప్రధానంగా దుస్తులు, అలంకరణ సామాగ్రి, ఇతర ఆట వస్తువులు కాలిబుడిద అయ్యాయి. రూపాయి రూపాయి కూడబెట్టి పెట్టుబడిగా పెడితే సామగ్రి మొత్తం బుగ్గిపాలైందని దుకాణదారులు వాపోతున్నారు. కళ్లెదుటే కాలిపోయిన దుకాణాలు చూసి దిగాలుపడిపోయారు.