Fire Accident in Ganesh Immersion Celebration In Nellore District 40 Injured : రాష్ట్రంలో వినాయక నిమజ్జనోత్సవాల్లో పలుచోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ బోల్తాపడి మరో ప్రమాదంలో 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. బాపట్ల జిల్లాలో ఓ గుడిసె దగ్ధమైంది.
విఘ్నేశ్వరుడి నిమజ్జన వేడుకల్లో పలు చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నిమనుబోలు మండలం కోదండరామపురంలో వినాయక చవితి ఊరేగింపులో ప్రమాదం జరిగింది. టపాసులు కాలుస్తుండగా ఓ ఇంటి ప్రహరీ గోడ పక్కన నిల్వ ఉంచిన బాణాసంచాపై నిప్పురవ్వలు పడి పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. పెద్ద మొత్తంలో బాణసంచా పేలడంతో అక్కడే ఉన్న కొందరు ఎగిరి పక్కన పడ్డారు.
టపాసులు నిల్వ ఉంచిన ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న రేకుల ఇళ్లు, ఇంటి తలుపులు, అద్దాలు, గేట్లు ధ్వంసమయ్యాయి. కరెంటు తీగలు కాలిపోయాయి. అక్కడే ఉన్న వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఒకవైపు అరుపులు, కేకలు, ఆర్తనాదాలు, రోదనలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఈ దుర్ఘటనలో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గూడురు ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు.