Family Members Attend Ramoji Rao Memorial Service : ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభకు పాత్రికేయ, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ శివారు కానూరులోని అనుమోలు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సభకు రామోజీరావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రామోజీరావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ క్రమంలోనే అమరావతి కోసం రామోజీ గ్రూప్ రూ.10 కోట్లు విరాళం అందించింది. ఈ మేరకు రామోజీ కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు విరాళం చెక్కు అందించారు. నాన్నగారి సంస్మరణ సభకు హాజరైన అందరికీ నమస్సులు అని కిరణ్ తెలిపారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరును నాన్నగారే సూచించారని, దేశంలోనే గొప్ప నగరంగా అమరావతి ఎదగాలని నాన్నగారు ఆకాంక్షించారని ఆయన పేర్కొన్నారు.
kiran Speech in Ramoji Rao Memorial Meet :ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీరావు అని కిరణ్ పేర్కొన్నారు. ప్రజల హక్కులను పాలకులు కబళించినప్పుడల్లా ఆయన బాధితుల పక్షం వహించేవారని తెలిపారు. దేశంలో ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉండేవారని చెప్పారు. ఆయన నమ్మిన పాటించిన విలువలను త్రికరణ శుద్ధిగా కొనసాగిస్తామని తమ కుటుంబ సభ్యులు, తన తరఫున సభా ముఖంగా మాటిస్తున్నట్లు కిరణ్ ప్రకటించారు.