False allegations against Chandrababu:పింఛనుదారులతో సీఎం ముఖాముఖి అంటూ నిర్వహించిన కార్యాక్రమంలో, వృద్ధులతో జగన్ పలికించిన మాటలు వింటే ఎవ్వరైనా ఆశ్చర్యపోయాల్సిందే. తమకు కుమారులు, కోడళ్లూ అవసరం లేదని, జగన్ ఉంటే చాలని వారితో చెప్పించిన మాటలు వింటే, భజనకు కూడా హద్దు ఉంటుందికదా అనిపించక మానదు. ఎందుకంటే కొందరిని ఎంపిక చేసి వారు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో కూడా ఎప్పటికప్పుడు ఐప్యాక్ ద్వారా శిక్షణ ఇప్పించారు. ఎక్కడైనా పదాలు మర్చిపోయినా, తడబడినా, ఆ సంస్థ ప్రతినిధులు పక్కనే ఉండి మాటలు అందించారు. చంద్రబాబుపై దూషణలు, శాపనార్థాలతో విరుచుకు పడ్డారు.
ఇప్పటి వరకు ‘మేమంతా సిద్ధం’ పేరుతో నిర్వహించిన సభల్లో ప్రతిపక్ష నేతను హంతకుడని విమర్శిస్తూ జగన్ మాట్లాడారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం ఆదివారం ఆయనకు నోటీసు కూడా ఇచ్చింది. దీంతో ఈ సదస్సులో ఎంపిక చేసిన వారితో చంద్రబాబుపై దూషణలు చేయిస్తూ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేడుక చూశారు. చంద్రబాబుని తిడుతుంటే ఆనందిస్తూ ముసిముసి నవ్వులు నవ్వారు. వాలంటీర్లంతా దేవునిదూతలుగా మీ రూపంలో వచ్చి పింఛను ఇచ్చారంటూ కొందరు ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడుతుంటే పొంగిపోయారు. చాలా బాగా మాట్లాడారంటూ వారందరినీ జగన్ ప్రశంసించారు. ప్రతిపక్ష నేతను దూషిస్తుంటే వారించాల్సిన బాధ్యత సీఎంకు లేదా? ఇదేం రాజకీయం? అనే ప్రశ్నలు వైసీపీ నేతల్లోనే విన్పించాయి. సదస్సుకు హాజరైన వారిలో కొందరు జగన్‌తో మాట్లాడుతూ తాము వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి బంధువులమని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు- ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా జగన్? - CM Jagan Election Campaign