Fake SI Calls and Threatens To Gold Shopkeepers in Anantapur District :ఎస్సై పేరిట ఓ మోసగాడు బంగారు దుకాణ వ్యాపారులకు ఫోన్లు చేశాడు. మీరు దొంగ బంగారం కొన్నారు, విచారణ చేయాలి పోలీసుస్టేషన్‌కు రండి అంటూ బుకాయించాడు. డబ్బులు ఇవ్వాలని లేకుంటే కేసులు నమోదు చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ యువరాజు తెలిపిన మేరకు, కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ పోస్టు ఖాళీగా ఉంది. ఓ మోసగాడు దీన్ని ఆసరాగా చేసుకున్నాడు. తాను కళ్యాణదుర్గం పట్టణ ఎస్‌ఐ నరేంద్రరెడ్డి అని 76709 94788, 80086 35488 నంబర్లతో కడప, గుంటూరుకు చెందిన ఇద్దరు బంగారు వ్యాపారులకు ఫోన్లు చేశాడు.
ఎస్సై పోస్టు ఖాళీగా: మీరు దొంగ బంగారం కొన్నారు. దొంగలు పట్టుబడి మీ పేర్లు చెప్పారంటూ మాట్లాడాడు. స్టేషన్‌కు వస్తే విచారణ చేయాలంటూ వ్యాపారులకు చెప్పాడు. డబ్బులు తీసుకురాకపోతే కేసులు పెట్టి అరెస్టు చేస్తానని బెదిరించాడు. అదే విధంగా అనంతపురానికి చెందిన ఓ టైలర్‌కు ఫోన్ చేసి మీ ఇంట్లో దొంగతనం జరిగింది కదా దొంగలు దొరికారు. బంగారం రికవరీ అవుతుంది మీరు డబ్బులు ఇవ్వాలని మభ్యపెట్టాడు. ఇద్దరు వ్యాపారులు, సదరు బాధితుడు కళ్యాణదుర్గం పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్సై నరేంద్రరెడ్డి ఎక్కడున్నారని సిబ్బందిని అడిగారు. ఇక్కడ ఎస్సై పోస్టు ఖాళీగా ఉందని, అలాంటి వ్యక్తులు ఎవరూ ఇక్కడ లేరని చెప్పడంతో కంగు తిన్నారు.